01-12-2025 10:50:22 PM
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా గ్రంధాలయానికి కవులు తమ రచనలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా బాధ్యులు కవులు తమ రచనలను గ్రంథాలయానికి అందించడం వల్ల పాఠకులకు ఈ ప్రాంత కవుల రచనలు చదివే అవకాశం లభిస్తున్నదని సాహిత్యపరంగా ఈ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు.
మేటి రచనలను అందించి గ్రంథాలయానికి సహకరించడం పట్ల వారి నిబద్ధత చాటుకున్నారని అన్నారు. తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ ఈ సందర్భంగా కవులకు అభినందనలు తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తమ విలువైన పుస్తకాలను అందించినందుకు కవులను ఘనంగా సన్మానించి జిల్లాలోని ప్రతి శాఖ గ్రంథాలయానికి చేరే విధంగా ప్రయత్నిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరవే జిల్లా బాధ్యులు ఎనిశెట్టి గంగా ప్రసాద్, మందపీతాంబర్, నాగభూషణం, కాశ నరసయ్య తమ తమ రచనలే కాకుండా ఎన్నిల ముచ్చట్లు కార్యక్రమంలో రూపొందిన కవితా సంపుటాలను గ్రంథాలయానికి అందించారు.