అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ
ఉట్నూర్,(విజయక్రాంతి): మహిళల సంక్షేమం కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిన రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన మొబైల్ ఫోన్లను ప్రతి కార్యకర్త వ్యక్తిగత అవసరాలకు వినియోగించకుండా శాఖాపరమైన ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అంగన్వాడి కేంద్రాల పనితీరుకు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు.
మహిళలు ఆర్థిక సాధికారత పై దృష్టి సారించాలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. పొదుపు సంఘాల మహిళలకు ఆర్టీసీ బస్సులతో పాటు పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాలకు రుణాలు మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. టిఆర్ఎస్ నాయకులు ఆదివాసి మహిళా మంత్రి అయినా సీతక్క పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, మంత్రి సీతక్క పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఉమాదేవి, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.






