calender_icon.png 12 January, 2026 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాలి

06-01-2026 01:24:51 AM

స్పష్టం చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, జనవరి 5 (విజయ క్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణిలో పాల్గొనాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 70 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు.

ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటవెంటనే పరిశీలించి, పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న తరహాలోనే జిల్లా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం ప్రగతిని పర్యవేక్షించేందుకు ఆన్లైన్ విధానాన్ని అవలంభిస్తామని తెలిపారు.   మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున, సంబంధిత అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని అన్నారు.

ముఖ్యంగా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఫాం-6, ఫాం-7 పరిష్కారంలో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తదితరులు ఫిర్యాదులు స్వికరించగా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు కలెక్టర్ ను ఆమె ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించారు.