కేసులున్న అభ్యర్థులను అరెస్టు చేయొద్దు
జూన్ 6 వరకు అరెస్టు వద్దన్న ఏపీ హైకోర్టు
విజయవాడ, మే 23 (విజయక్రాంతి): ఎన్నికల్లో పోటీచేసి కేసులను ఎదుర్కొంటూ హైకోర్టును ఆశ్రయించిన పలువురు టీడీపీ, వైసీపీ అభ్యర్థులను అరెస్టు చేయరాదని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేసిన అభ్యర్థులను జూన్ 6వ తేదీవరకు అరెస్ట్ చేయవద్దని జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌లను మంజూరు చేశారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని, పోలీసులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు.
తాడిపత్రి, మాచర్ల, నర్సరావుపేట, దెందులూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయా పార్టీల అభ్యర్థులకు ఈ ఆదేశాలతో ఉపశమనం లభించింది. తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. పిటిషనర్లు ఓట్ల లెక్కింపు ముగిసేవరకు పోటీచేసిన చోట ఉండరాదని ఆదేశించింది. నలుగురికంటే ఎక్కువ మందితో తిరగరాదని, ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, కేసుల దర్యాప్తును ప్రభావితం చేయరాదని స్పష్టంచేసింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారు కాబట్టి అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ధర్మాసనం సూచించింది.






