ప్రైవేట్ కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్
డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులకు కొత్త రూల్స్
శిక్షణ కేంద్రాలకూ పలు నిబంధనలు
ట్రైనింగ్‌కు కనీస కాలపరిమితి విధింపు
జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు
న్యూఢిల్లీ, మే 23: డ్రైవింగ్ లైసెన్స్, శిక్షణ నిబంధనల్లో రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీవో) చుట్టూ తిరగకుండానే డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావొచ్చు. కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ పరీక్షల కోసం ప్రైవేట్ సెంటర్లకు వెళ్లవచ్చు. ఇందుకోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం డ్రైవింగ్ టెస్ట్ పూర్తయ్యాక వారు ఓ సర్టిఫికెట్ జారీ చేస్తారు. దానితో మీరు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి లైసెన్స్ పొందవచ్చు. ఆర్టీవోపై భారం తొలగించడంతో పాటు దరఖాస్తుదారులకు ఇబ్బందులు తగ్గించి లైసెన్స్ పొందే ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారా లైసెన్స్ ప్రక్రియ చేపట్టేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ట్రైనింగ్ సెంటర్లకూ నిబంధనలు
1. కొత్త మార్పుల్లో భాగంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు పలు నిబంధనలను ప్రభుత్వం విధించింది.
2. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం ఒక ఎకరం భూమిని ట్రైనింగ్ సెంటర్లు కలిగి ఉండాలి. ఫోర్ వీలర్ అయితే అదనంగా మరో రెండు ఎకరాలు ఉండాలి.
3. ఈ స్కూళ్లలో అన్ని రకాల టెస్టింగ్ సదుపాయాలు ఉండాలి. ట్రైనర్లకు హైస్కూల్ డిప్లోమా లేదా దానికి సరిసమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఐటీ సిస్టమ్స్‌పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
ట్రైనింగ్ కాల పరిమితి
1. లైట్ మోటార్ వెహికిల్స్‌కు కనీసంగా 4 వారాల్లో 29 గంటలు. ఇందులో 8 గంటలు థియరీ, 21 గంటలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది.
2. భారీ వాహనాలకు 6 వారాల్లో 38 గంటలు. ఇందులో 8 గంటలు థియరీ, 31 గంటలు ప్రాక్టికల్ ట్రైనింగ్ అవసరం.
ఫీజు, చార్జీలు ఇలా
1. లెర్నింగ్ లైసెన్స్ రూ.200
2. లెర్నింగ్ లైసెన్స్ రెన్యూవల్ రూ.200
3. ఇంటర్నేషనల్ లైసెన్స్ రూ.1000
4. పర్మనెంట్ లైసెన్స్ రూ.200
5. పర్మనెంట్ లైసెన్స్ రెన్యూవల్ రూ.200
6. డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, రెన్యూవల్ రూ.10,000
7. డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ రూ.5,000
దరఖాస్తు ప్రక్రియ
1. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేయలేదు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అప్లు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అప్లు చేయాలనుకుంటే https://parivahan.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
2. సంబంధిత రాష్ట్రాన్ని ఎంచుకోవాలి
3. డ్రైవింగ్ లైసెన్స్ మెనూ నుంచి కొత్త డ్రైవింగ్ లెసెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
4. దరఖాస్తు ఫారమ్‌ను నింపి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి
5. ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఫీజు స్లిప్‌తో షెడ్యూల్ చేసిన తేదీలో ఆర్టీవోను సందర్శించాలి
పర్యావరణ అనుకూల విధానం
కాలం చెల్లిన 90 వేల ప్రభుత్వ వాహనాలను దశలవారీగా తొలగించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇతర వాహనాల ఉద్గార స్థాయిలను తగ్గించేందుకు చర్యలు తీసుకోనుంది. ఈ చర్యలు వాహన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు సహకరిస్తుందని భావిస్తోంది.
జరిమానాల పెంపు
దరఖాస్తు ప్రక్రియతో పాటు నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు విధించే జరిమానాలను కూడా రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ పెంచింది. ఓవర్ స్పీడ్‌కు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య ఉన్న జరిమానాను మార్చలేదు. కానీ, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25,000 ఫైన్‌తో పాటు వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. అంతేకాకుండా 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ పొందేందుకు అనర్హులుగా ప్రకటిస్తారు.






