calender_icon.png 20 August, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు

13-08-2024 03:15:00 AM

  1. మేడిగడ్డ కేసులో విచారణ కూడా ఆపండి
  2. పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్ సందర్శన సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌పై నమోదైన కేసులో విచారణను నిలిపేయాలని పోలీసుల కు హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. మేడిగడ్డ సందర్శన సమయంలో అను మతి లేకుండా డ్రోన్ వినియోగించారని ఏఈఈ షేక్ వలీ ఫిర్యాదు చేయటంతో మహదేవ్‌పూర్ పోలీసులు జూలై ౨౯వ తేదీన కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.

ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కేటీఆర్, వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ హైకోర్టును ఆశ్ర యించారు. వీరి పిటిషన్లను సోమవారం జస్టిస్ కే లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈకేసులో పిటిషనర్లను అరెస్టు చేయొ ద్దని, విచారణ ప్రక్రియను కూడా నిలిపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకపోవటం వల్ల పిటిషనర్లు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు.

వీరు జూలై 26న అక్కడకు వెళ్తే 3 రోజుల తరువాత ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. డ్రోన్ కెమెరాతో మేడిగడ్డను చిత్రీకరించడం వల్ల బరాజ్‌కు ప్రమాదం పొంచి ఉందని ఏఈఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 223(బీ) రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారని, దీని ప్రకారం తాము అధికారుల ఉత్తర్వులను ఉల్లంఘించలేదని తెలిపారు.

ఆరోపణలు అవాస్తవమని, ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్న సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని వాదించారు. దురుద్దేశంతోనే కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసులో విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు అనుగుణంగా అభియోగాలు లేవని, దీనిపై సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతివాదిగా ఉన్న షేక్ వలీకి నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు.