20-08-2025 05:27:22 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు సకాలంలో స్పందించి పరిష్కరించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని విక్టోరియా గంజ్ లో పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు పలువురు మంగళవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి విన్నవించారు. స్పందించిన ఆయన బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి విక్టోరియా గంజ్ లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా తమ బస్తీలో తరచుగా డ్రైనేజీ పొంగిపోతున్నదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వివరించారు. అంతేకాకుండా నల్లా బిల్లులు చెల్లిస్తేనే డ్రైనేజీ లైన్ శుభ్రం చేస్తామని అధికారులు సమాధానం చెబుతున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పిర్యాదు చేసారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ ఇక్కడ అంత నిరుపేదలే నివసిస్తున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులను ఆదేశించారు.
తమ ప్రభుత్వం ఉచితంగా త్రాగునీటి సరఫరా కార్యక్రమం ప్రారంభించిందని, నల్లా బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేశారు. నల్లా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వెంటనే విక్టోరియా గంజ్ లో డ్రైనేజీ లైన్ ను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని, అవసరమైతే నూతన లైన్ ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైనేజీ శుభ్రం చేసే క్రమంలో పాత వస్త్రాలు, ప్లాస్టిక్ కవర్లు వంటివి వేస్తున్న కారణంగా డ్రైనేజీ లైన్ లు బ్లాక్ అవుతున్నాయని అధికారులు ఎమ్మెల్యే కు వివరించారు.
డ్రైనేజీ లైన్ లో ఎలాంటి వస్తువులు వేయవద్దని, వేస్తే మీరే ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. అదేవిధంగా నూతన రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు, క్రిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉన్నదని బస్తీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించి నూతన సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరగకముందే విద్యుత్ తీగలను తొలగించాలని చెప్పారు.