29 June, 2026 | 4:08 PM

పోడురైతులను ఇబ్బంది పెట్టొద్దు

13-06-2024 02:27 AM

అటవీశాఖ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్12 (విజయక్రాంతి): పోడు రైతుల జోలికి వెళ్లొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అటవీశాఖ అధికారులకు సూచించారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఐటీడీఏ పీవో కుష్భూ గుప్తా, అదనపు కలెక్టర్లు దీపక్‌తివారి, దాసరి వేణు, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడు భూముల లొల్లి రోజురోజుకు పెరుగుతుందని, ప్రస్తుతం సాగు చేసుకుంటున్న భూముల జోలికి వెళ్లకుండా కొత్తగా అటవీని నరకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆసిఫాబాద్ జిల్లాలో పని చేయడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారని, ఇక్కడ పని చేస్తున్న అధికారులు ఈ ప్రాంతం విశిష్టత గురించి సోషల్ మీడియాలో వైరల్ చేయాలని కోరారు. జిల్లా దవాఖానలో అన్ని వసతులున్నా గర్భిణులు చికిత్సకు ముందుకురావడం లేదని మంత్రి దృష్టి వైద్యులు తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మంత్రి.. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ దవాఖానలో తమ కుటుంబ సభ్యులకు ప్రసూతి చేయిస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. వానకాలం నేపథ్యంలో వాగులు ఉన్న చోట ఐరన్ బిడ్జిలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.  విత్తనాల సమస్య తొలగించాలని కోరారు.

ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి భూమిపూజ

జిల్లాను అగ్రభాగన నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క కోరారు. జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావుతో కలసి భూమి పూజ చేశారు.