కరెంటు మంచిగా వస్తుందా?
- ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది?
- మహిళలతో డిప్యూటీ సీఎం మాటామంతి
- బస్సులో ప్రయాణం
ఖమ్మం, జూన్ 12 (విజయక్రాంతి): కరెంటు మంచిగా వస్తుందా? ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఎన్నిసార్లు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారు? అంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్టీసీ మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్లు మండలం జగన్నాథపురం వరకు సామాన్యుడిలా బస్సులో ప్రయాణం చేసిన భట్టి.. ప్రయాణికులతో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు. నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ, అనంతమ్మతో ముచ్చటించారు. భట్టి ప్రశ్నలకు వారు ఇద్దరు స్పందిస్తూ ‘బడి, గుడి, పేరంటాలకు ఉచితంగా బస్సులో వెళ్లడం మూలంగా డబ్బులు మిగులుతున్నాయి.
ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతోంది’ అని సంతోషంగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మహిళలకు జారీ చేస్తున్న జీరో టికెట్ల విధానం గురించి కండక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భట్టి మీడియాకు పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్రంలో 92 శాతం ఉన్న బలహీనవర్గాలు అభివృద్ధి చెందటమే లక్ష్యమన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని స్పష్టంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం అమలు చేయడం వల్ల ఆర్టీసీ బలోపేతం అవుతున్నదని, కొత్తగా 300కుపైగా బస్సులు కొన్నామన్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీలో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్‌లో పాతర్లపాడుకు వెళ్లే బస్సును ప్రారంభించారు. ఆర్టీసీ అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించడానికి ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు వైరా ఎమ్మెల్యే రామదాసునాయ క్, కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న తదితరులు ఉన్నారు.






