15-01-2026 12:57:58 AM
ఆలేరు, జనవరి 14 (విజయక్రాంతి): మండలంలోని సాయిగూడెం లోని బీసీ కమిటీ హాల్ను గ్రామ పంచాయతీ కార్యాలయంగా మార్చే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరుతూ గ్రామ బీసీ సంఘాల నాయకులు బుధవారం గ్రామ సర్పంచ్ గ్యార కవిత సంపత్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా బీసీ సామాజిక వర్గాల సమావేశాలకు, విద్యార్థుల చదువులకు ఈ కమిటీ హాల్ ఎంతో ఉపయోగ పడుతుందని, గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి ఇతర ప్రత్యామ్నాయ స్థలాలు ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా బీసీల సామాజిక భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకోవడం సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల వెనుకబడిన వర్గాల ప్రజలు తమ సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వేదిక లేకుండా పోతుందన్నారు.
ఒకవేళ బలవంతంగా భవనాన్ని మార్చాలని చూస్తే గ్రామస్థులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామస్తులు ఉదరి రాములు, మాజీ వార్డ్ మెంబర్ చింతకింది మల్లేష్, మైల శ్రీశైలం, లక్ష్మయ్య, పుట్ట పవన్, గంగాధరి సుధీర్ కుమార్, బొడ్డు సత్తయ్య, బండి శ్రీనివాస్, బొడ్డు మహేందర్, బొప్పాపురం వెంకటేష్ యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.