15-01-2026 12:56:35 AM
పార్టీల వ్యూహాలతో రసవత్తంగా మారుతున్న రాజకీయం
వేగంగా మారుతున్న రాజకీయ వ్యూహాలు
హుజూర్ నగర్, జనవరి 14 : పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైతే.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం రాజకీయ సందడి నెలకొంది. పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఓ వైపు వార్డుల మ్యాపింగ్, ఓటర్ల ముసాయిదా జాబితాల విడుదలతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశారు.
మరోవైపు ఆశావహులు వివిధ వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. వారం లోపే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారంతో పట్టణాల్లో హడావుడి పెరిగింది. మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే హుజూర్ నగర్ నియోజకవర్గంలోని హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీ లలో రాజకీయ సందడి మొదలైంది. పోటీకి సిద్ధమవుతున్న వివిధ పార్టీల నేతలు ఇప్పటికే వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసు కుంటున్నారు. ఈసారి ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో టికెట్ల వేటలో ఆయా పార్టీల నేతలు తనకమునకలయ్యారు.
ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఒక్కో వార్డులో ముగ్గురు, నలుగురు పోటీ పడుతుండటంతో అధిష్ఠానానికి ఎంపిక కత్తిమీద సాములా మారింది. హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉండగా 29,996 ఓటర్లు ఉన్నారు. వీరిలో 14,257 పురుషులు, 15731 మహిళలు, 8 ట్రాన్స్ జెండ్సర్స్ ఉన్నారు. నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 15 వార్డులు ఉండగా 13,746 ఓటర్లకు గాను 7,116 పురుషులు, 6,629 మహిళలు, ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. పలు పార్టీల రాజకీయ వ్యూహాలతో పుర పోరులో గెలిచేదెవరు అంటూ పట్టణాలలో పెద్ద చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్‌లో మూడంచెల ప్రణాళిక..
పురపాలక సంఘాల ఎన్నికలకు కాంగ్రెస్ మూడంచెల ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆయా వార్డుల వారీగా కసరత్తు మొదలు పెట్టిన ఆ పార్టీ, రిజర్వేషన్లు ఖరారు. కాకపోవటంతో...ఆయా వార్డుల్లో ప్రభావం చూపే సామాజిక వర్గాల్లో బలమైన వ్యక్తులు ఆరుగురితో జాబితా సిద్ధం చేసుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టే క్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఒక కమిటీ వేస్తున్నట్లు సమాచారం.
వీరు ఆయా వార్డుల వారీగా పరిశీలన చేసి అభ్యర్థుల జాబితా తయారు చేయనున్నట్లు తెలుస్తుంది. డీసీసీ సైతం 10 మంది కమిటీతో ఆ జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తుంది. పీసీసీ నుంచి వచ్చే ప్రతినిధులతో సమావేశమై అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టమైన సమాచారం ఉండటంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సమన్వయ, వార్డు కమిటీలను ఏర్పాటు చేసి జనంలోకి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
బీఆర్‌ఎస్ బస్తీబాట..
బిఆర్‌ఎస్ పార్టీ సైతం పుర పోరుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బస్తీ బాట కార్యక్రమం ద్వారా ప్రజల్ని కలిసి స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు.ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు,మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సైతం నేరేడుచర్ల మున్సిపాలిటీలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి పుర పోరుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.
బీజేపీలో భేటీలు..
భాజపా మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు సూర్యాపేట జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు పోరెడ్డి శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీ లలో ముఖ్య నాయకుల సమావేశాలు నిర్వహించారు. రిజర్వేషన్ల అంశాన్ని పరిగణలోకి తీసుకొని బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు.
తమ పట్టు చాటాలని సీపీఐ..
సీపీఐ ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు పెట్టుకుంది. తమకు పట్టున్న వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టి.. మిగతా చోట్ల పరిస్థితిపై చర్చించింది. సీపీఎం, కాంగ్రెస్తో పొత్తు అంశాలపై పార్టీ పెద్దలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. ఏది ఏమైనా రెండు మున్సిపాలిటీలలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు.