13 April, 2026 | 6:54 AM

పురుగుల బియ్యం వంటకు వద్దు

08-12-2024 02:35 AM
  1. బూజు ఉన్న పదార్థాలతో వంట చేయొద్దు 
  2. గురుకులాలు, వసతి గృహాల్లో నాణ్యతకు పెద్దపీట 
  3. వంట సిబ్బంది మాస్క్, ఆఫ్రాన్ ధరించాల్సిందే
  4. మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): గురుకులాలు, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇటీవల పలుచోట్ల చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను నివారించడానికి చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు భోజనం అందించేందుకు వంటకాలు, ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలకు మార్గదర్శకాలు   రూపొందించింది. 

బియ్యం, రవ్వలో పురుగులు కనిపించినా, బూజు లాంటిది కనిపించినా ఎట్టి పరిస్థితుల్లో వంటకు వినియోగించకూడదని అధికారులు, సిబ్బందిని ఆదేశించింది. వంట చేసే ముందు ప్రిన్సిపల్, డ్యూటీ టీచర్, మెస్ ఇన్‌చార్జీ పరిసరాలను పరిశీలించడంతోపాటు వండిన తర్వాత తప్పనిసరిగా రుచి చూడాలని సూచించింది. వంట చేసే సిబ్బంది బ్యాగులను కచ్చితంగా తనిఖీ చేయాలని పేర్కొంది. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లు, గురుకుల పాఠశాల సిబ్బం దిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

మార్గదర్శకాలు ఇలా..

* భోజనానికి అవసరమైన దీర్ఘకాలం నిల్వ ఉంచే పొడి పదార్థాలకు నెలకు ఒకసారి, త్వరగా పాడయ్యే పదార్థాలకు వారంలో మూడుసార్లు ఇండెంట్ పెట్టాలి. వంట వండేందుకు అవసరమైన          రక్షిత నీటి సౌకర్యం ఉండాలి. ట్యాంకులను శుభ్రం చేసిన వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఓవర్‌హెడ్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి, భూగర్భ ట్యాంకులను నెలకు ఒకసారి శుభ్రం               చేయాలి. 

విద్యార్థులకు వంట కోసం ఉపయోగించే బియ్యం, రవ్వలో పురుగులు, బూజు వంటివి కనిపిస్తే వంటకు వినియోగించకూడదు. 

సరఫరా అయిన ఆహార పదార్థాలకు టెండరులో పేర్కొన్న బ్రాండ్, ఆహార నాణ్యత ప్రమాణా ఏజెన్సీల అనుమతి, తయారీ వినియోగ గడువు తేదీ, ఇండెంట్ ప్రకారం బరువు ఉన్నాయో లేదో          పరిశీలింంచాలి. ద్రవ పదార్థాలు లీక్ అయినా, పొడి పదార్థాల్లో పురుగులు కనిపించినా వెంటనే వాడటం మానేయాలి.

* ప్రిన్సిపల్, డ్యూటీ టీచర్, మెస్ ఇంఛార్జీ విద్యార్థులకు వడ్డించే ముందు భోజనం రుచి చూడాలి. 

* తేమలేని ప్రాంతంలో ఆహార పదార్థాలను భద్రపరచాలి. కూరగాయలు, పండ్లు రోజుకు రెండుసార్లు చూసి, పాడైనవి తొలగించాలి. కొత్త వస్తువులు, పాత వస్తువులు కలిపి ఒకే చోట నిల్వ                  చేయకూడదు. నిల్వ డబ్బాలను నెలకు ఒకసారి శుభ్రం చేయాలి. 

* ఆహార కమిటీ, ప్రత్యేక అధికారులు స్టోర్‌ని పర్యవేక్షించాలి. రోజుకు ఒకసారి వాటిని రిజిస్టర్‌లో నమోదు చేయాలి. వంటగది నేలపై మురికి లేకుండా రోజూ శుభ్రం చేయాలి. గ్యాస్ పైపు ఆరు              నెలలకు ఒకసారి మార్చాలి. వంట సిబ్బంది చేతులను 30 సెకన్లపాటు శుభ్రంగా కడుక్కోవాలి. కూరగాయలు తరిగే చాకులు, చాక్‌ప్యాడ్‌లను ఎప్పటికప్పుడు కడగాలి. కిచెన్ వ్యర్థాలను   ప్రతిరోజూ  తొలగించాలి.

 ప్రతిరోజూ డ్యూటీ టీచర్ వంట సామాగ్రిని పరిశీలించాలి. మిగిలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు పెట్టకూడదు. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి పప్పు వేర్వేరుగా వండాలి. వంటల శాంపిళ్లు 12 గంటల పాటు భద్రంగా ఉంచాలి. 

విద్యార్థులకు భోజనం అందించే విషయంలో కచ్చితంగా సమయ పాలన పాటించాలి.