ఎవరిని వదలం
అక్రమార్కుల భరతం పడతా! వారినుంచి చెరువుల చెర విడిపిస్తా
- శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తితోనే యుద్ధ్దం
- విలాసాల కోసం ఫాంహౌస్‌లు కట్టి చెరువుల్లోకి మురుగు వదులుతున్నారు
- ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోబోం
- స్పష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
- కోకాపేట హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన
రాజేంద్రనగర్, ఆగస్టు 25: కొందరు శ్రీమంతులు తమ విలాసాల కోసం చెరువుల్లో ఫాం హౌస్‌లు నిర్మించుకున్నారని, చెరువులను ఆక్రమించుకున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోనని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. చెరువుల ఆక్రమణదారులు ఎంతటి వారైనా.. వారి భరతం పడతా నని హెచ్చరించారు. తనపై ఎంతటి స్థాయిలో ఒత్తిడి వచ్చినా తలొగ్గేది లేదని స్పష్టంచేశారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం చెరువుల ఆక్రమణలపై యుద్ధం చేస్తున్నట్టు హైడ్రా కూల్చివేతలను అభివర్ణించారు.
హరేకృష్ణ సంస్థ ఆధ్వ ర్యంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో భాగంగా కోకాపేటలో 430 అడుగుల ఎత్తు నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్ టవర్ భవనానికి మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధ నల స్ఫూర్తిగా తమ ప్రభుత్వం ధర్మం వైపు నిలబడుతుందని అన్నారు.
చెరువుల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకున్న వారు ప్రభుత్వంలో భాగస్వాములైనా, ఇంకా ఎవరైనా ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నా అవేమీ పట్టించుకోకుండా అక్రమ కట్టడాలను కూల్చివేస్తానని పునరుద్ఘాటించారు. హైడ్రా విషయంలో ఎవరెన్ని ఒత్తిడులు తెచ్చినా పట్టించుకోబోమని తేల్చి చెప్పారు. వీటిని విస్మరిస్తే తాము ప్రజా ప్రతినిధులుగా ఉండి కూడా వ్యర్థమే అవుతుందని అన్నారు. చెరువుల ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చి వేత రాజకీయ కక్షల కోసం కానేకాదని స్పష్టం చేశారు.
లేక్‌సిటీకి పూర్వవైభవం తెస్తాం
ఒకప్పుడు లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకొ స్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందు లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదన్నారు. తనపై ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. జంట జలాశయా లను పరిరక్షంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే చెరువుల పరిరక్షణకు మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టంచేశారు.
శతాబ్దాల కిందటే హైదరాబాద్‌ను చెరువుల నగరంగా నాటి పాలకులు అభివృద్ధ్ది చేశారని గుర్తుచేశారు. కోట్లాది మంది దాహార్తిని తీర్చిన చెరువుల పరిధిలో ఇవాళ కొందరు వ్యక్తులు విలాసాల కోసం ఫాంహౌస్‌లు నిర్మించి వ్యర్థ జలాలను చెరువుల్లోకి వదులుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని వదిలేస్తే తాను ప్రజాప్రతినిధిగా విఫలం అయినట్టని చెప్పా రు. అక్రమార్కుల చెర నుంచి చెరువులకు విముక్తి కల్పిస్తామని స్పష్టంచేశారు. దీనికి స్ఫూర్తి భగవద్గీత అని ఉదహరించారు. ప్రకృతి వనరులను కాపాడుకోకపోతే తీవ్రమైన అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు. భగవద్గీత స్ఫూర్తిగా శ్రీకృష్ణుడే ధర్మ రక్షణగా భావిస్తున్నామని సీఎం అన్నారు. కాంక్రీట్ జంగల్‌గా మారిన కోకాపేట ప్రాంతంలో హరే కృష్ణ హెరిటేజ్ భవనం ద్వారా ప్రపంచానికి ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. ఇలాంటి మహోత్తమ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తన జన్మ ధన్యమైందని అన్నారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ప్రభుత్వ దవా ఖానల్లో భోజనం అందించేందుకు హరేకృష్ణ ఫౌండేషన్ సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.






