20 రోజులు.. 18 కూల్చివేతలు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
- 43 ఎకరాలకుపైగా భూములు స్వాధీనం
- సినీనటుడు నాగార్జున, ఎమ్మెల్యేలు ముబీన్, దానం, ఎమ్మెల్సీ మీర్జా రహమ్మత్ సహా ప్రముఖుల పేర్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): సినీనటుడు నాగర్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరు మార్మోగుతుంది. నగరంలో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, పార్కులు, ఇతర ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఏర్పాటైన 20 రోజుల్లోనే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపడుతూ హైడ్రా ప్రజల మన్ననలను పొందుతున్నది. హైడ్రా చేపడుతున్న ఆక్రమణల కూల్చివేతల వివరాల నివేదికను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం ప్రభుత్వానికి అందజేశారు. 18 చోట్ల అక్రమ నిర్మాణాల తొలగించినట్టు వివరించారు.
ఈ 18 ప్రాంతాలలో మొత్తం 43.94 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు హైడ్రా కూల్చిన ఆక్రమణల వివరాలు, ఆ నిర్మాణాల వెనుకున్న నాయకులు పేర్లను వివరాలతో సహా నివేదికలో పొందుపర్చారు. ఇప్పటివరకు లోటస్‌పాండ్, మన్సూరాబాద్, బం జారాహిల్స్, బీజేఆర్‌నగర్, గాజులరామారం, అమీర్‌పేటలో అక్రమ కట్టడా లను కూల్చివేసినట్టు హైడ్రా నివేదికలో పేర్కొంది.
ఈ అక్రమ నిర్మాణాలకు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం పార్టీకి చెందిన బహదూర్‌పూర్ ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమ్మత్‌కు చెందిన నిర్మాణాలతోపాటు కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్‌రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, చింతల్ బీఆర్‌ఎస్ నేత రత్నాకర్ రాజులు యజమానులుగా ఉన్నారని తెలియజేశారు. నగరంలోని నందగిరి హిల్స్‌లో పార్కును ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేసిన ఆక్రమణదారులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుగా నిలిచారంటూ నివేదికలో పేర్కొన్నారు.







