నేను చెప్పినా వినరా!
- మీరు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి
మిమ్మల్ని ఈ ఫైల్ ఎవరు పెట్టమన్నారు?
సచివాలయ ఉద్యోగుల సమక్షంలోనే.. సీఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
ఏపీ ఉద్యోగుల ఫైల్ వాపస్ చేసిన సీఎం?
‘విజయక్రాంతి’ కథనంపై ఉద్యోగుల హర్షం
‘నేను చెప్పినా వినరా? మీరు చెప్పేది
ఒకటి.. చేసేది మరొకటి. మిమ్మల్ని ఈ ఫైల్
ఎవరు పెట్టమన్నారు?’..
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయ ఉద్యోగుల సాక్షిగా అన్న మాటలివి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 16 (విజయక్రాంతి): దొడ్డిదారిన తెలంగాణ సచివాలయంలో తిష్ట వేయాలనుకున్న ఏపీ ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఏపీ ఉద్యోగులకు మేలు చేయాలనుకున్న సీఎస్ ప్రయత్నాలకు బ్రేక్ పడిండి. ఏపీ సచివాలయంలో, వివిధ శాఖల్లో పని చేస్తున్న సుమారు 1,808 మంది ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.
ఇందులో 40 మంది సెక్షన్ ఆఫీసర్లు, మరో 20 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులు ఉన్నారు. తెలంగాణ నుంచి 1,350 మంది ఉద్యోగులు ఏపీకి వెళ్లేందుకు సానుకూలంగా ఉన్నారు. అయితే ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న ఉద్యోగుల్లో 5 శాతం మంది మాత్రమే తెలంగాణ స్థానికత కలిగి ఉండగా, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్నవారు మాత్రం 98 శాతం ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులు. ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకోవడంపై తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ (టీఎస్‌ఎస్‌ఏ), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ మేరకు సీఎస్ శాంతి కుమారితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించాయి. మంత్రి సానుకూలంగానే స్పందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయంలోని రెండు ఉద్యోగ సంఘాలు కూడా సీఎంకు వేరువేరుగా వినతి పత్రాలు అందించాయి. కానీ సీఎస్ శాంతి కుమారి ఆగమేఘాల మీద తెలంగాణకు రావాలనుకున్న ఏపీ ఉద్యోగుల ఫైల్ సీఎం రేవంత్‌రెడ్డి ముందు పెట్టారు. ఈ వ్యవహారంపై ‘విజయక్రాంతి’ దినపత్రిక ఆదివారం సంచికలో ‘సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు’ శీర్షికతో ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
తెలంగాణ సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులను ఎలా తీసుకొస్తారని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏపీ ఉద్యోగుల ఫైల్‌ను సీఎం వాపస్ చేసినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో సీఎస్ తీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసిట్టు సమాచారం. సచివాలయ ఉద్యోగుల ముందే ఆమెను ‘నేను చెప్పినా వినరా ? మీరు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. మిమ్మల్ని ఈ ఫైల్ ఎవరు పెట్టమన్నారు?’ అని నిలదీసిట్టు తెలిసింది.
‘విజయక్రాంతి’ కథనంపై ఉద్యోగుల హర్షం
సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు శీర్షికతో ఆదివారం విజయక్రాంతి పత్రికలో ప్రచురితం అయిన కథనం పట్ల టీఎస్‌ఎస్‌ఏ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, టీజీవో, టీఎన్జీవో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ౬౦ ఏండ్లుగా ఏపీ ఉద్యోగుల కారణంగా తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగానే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యోగులు పోరాటం చేశారని, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన పదేండ్ల తర్వాత మళ్లీ అక్రమంగా తిష్ట వేసేందుకు ఏపీ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగుల ఎంట్రీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఉద్యోగుల ఫైల్‌ను తిరస్కరించాలని, లేని పక్షంలో రాష్ట్రస్థాయిలో ఆందోళన చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.






