10-05-2025 12:23:56 AM
భారత్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించారు. భారత సైన్యానికి తన మద్దతును తెలియజేస్తూ దేశ పౌరులకు ఒక ముఖ్య సందేశాన్నిచ్చారాయన.
ఈ సున్నితమైన సమయం లో ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా కోరారు. ‘మన దేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతున్న ధైర్యవంతులైన మన భారతీయ సాయుధ బలగాలకు వందనం. వారి ధైర్యం స్ఫూర్తితో, శాంతి, ఐక్యతతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి మనం ఒక దేశంగా కలిసి నిలబడదాం.
మీరు భారత సైన్యం కదలికలను చూస్తే ఫొటోలు, వీడియోలను తీయడం షేర్ చేయడం వంటివి చేయొద్దు. ఇలా చేస్తే మీరు శత్రువుకు సహాయం చేసినట్టే అవుతుంది. ధ్రువీకరించని వార్తల్ని, పుకార్లను ఫార్వర్డ్ చేయడం ఆపండి. ప్రశాంతంగా, అప్రమత్తంగా, సానుకూలంగా ఉండండి. విజయం మనదే’ అని రాజమౌళి రాసుకొచ్చారు.