25 August, 2026 | 6:08 AM

స్పందించాలంటే... మనుషులు చావాలా?

25-08-2026 01:56 AM
  1. చిరుతల సంచారంతో గ్రామాల్లో భయాందోళన 
  2. పశువులపై వరుస దాడి చేస్తున్నా.. పట్టింపు లేదు
  3. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం.. దర్జాగా చిరుతల సంచారం 
  4. భారీ ఎత్తున ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్న ప్రజలు
  5. ఇప్పటికే విజయక్రాంతి ఈ ఘటనలపై వరుస కథనాలు 

గండీడ్, ఆగస్టు 24 : జనం నిత్యం తిరుగుతున్న పంట పొలాలలో చిరుతల సంచారం ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి అంచనా వేయండి. గత ఆరు నెలలుగా గండేడ్ మండల పరిధిలోని బల్సురుగొండ, మనసుర్ పల్లి, వాసిరెడ్డిపల్లి, షేక్ పల్లి, ఎల్లం బాయి తండా పరిసర ప్రాంతాలలో చిరుతలు గత ఆరు నెలల నుంచి సంచరిస్తున్నాయని జనం గగ్గోలు పెట్టుకుంటున్న అటవీ శాఖ అధికారుల నుంచి మాత్రం ఇలాంటి స్పందనలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు.

వరుసగా లేగ దూడలపై చిరుతలు దాడి చేసి చంపేస్తున్న అటవీశాఖ అధికారులు వచ్చి పంచనామా చేసి వెళ్తున్నారే తప్ప ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులను మాత్రం తొలగించేందుకు ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు.  బొందేగట్టు పైనే మూడు చిరుతపులులు సంచరిస్తూ అక్కడే స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విజయక్రాంతి దినపత్రిక ఏ విషయంపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక కథనాలు ప్రచురితం చేసింది. 

ఫొటోలు తీసుకునేందుకు మాత్రమే వస్తుండ్రు..

పశువులపై దాడి జరిగిన ప్రతిసారీ అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లిపోతున్నారే తప్ప, చిరుతల సంచారాన్ని అరికట్టేందుకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు రైతుల జీవనాధారమైన గేదెలు, మేకలపై వరుసగా దాడులు చేసి చంపుతున్నా ఎందుకు స్పందిస్తలేరని, ఇప్పటివరకు ఇంత జరిగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

చిరుతల దాడులు జరిగినా స్పందన కరువు...

 అశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోటకొండ వెంకటయ్యకు చెందిన గేదె దూడ ను ఆదివారం రాత్రి చిరుత దాడిలో మృతి చెందింది.గత రాత్రి పశువుల పాకలో గేదెలను కట్టేసి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున పాక వద్దకు వెళ్లి చూడగా గేదె దూడ మృతి చెంది కనిపించింది. రాత్రి వర్షం కురవడంతో పాక పరిసరాల్లో చిరుతల అడుగుజాడలు కనిపించాయని, చిరుతలే దూడను చంపి తిన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల మైబుకు చెందిన రెండు మేకలపై చిరుత దాడి చేయడంతో అవి మృతి చెందాయి.

ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా బీట్ ఆఫీసర్ ఉదయ్ ఈశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత దాడిలో మృతి చెందిన గేదె దూడను పరిశీలించి పంచనామా చేశారు. మన్సూర్పల్లి గ్రామ సర్పంచ్ కొమిరే నాగేంద్రమ్మసూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ తరఫున వినతిపత్రం సమర్పించడంతో పాటు డీఎఫ్‌ఓతో సహా మండలస్థాయి అధికారులను కలిసి సమస్యను వివరించినప్పటికీ అటవీశాఖ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై సంబంధిత అధికారులు స్పందించకపోతే భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని వారు చెబుతున్నారు.