7 August, 2026 | 2:30 AM

నేతన్న బతుకు బాగుపడేదెన్నడు?

07-08-2026 12:00 AM

నేడు జాతీయ చేనేత దినోత్సవం :

భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకొంటారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఈ రోజును నిర్వహిస్తారు. ఆ ఉద్యమం చేనేత స్వావలంబనకు, జాతీయ గౌరవానికి ప్రతీకగా నిలిచింది. శతాబ్దానికి పైగా గడిచినా ఆ ప్రతీక నిలిచే ఉంది. కానీ, దాన్ని సజీవంగా నిలబెడుతున్న నేతన్నలు మాత్రం ఇప్పటికీ మనుగడ కోసం పోరాడుతూనే ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నాలుగో అఖిల భారత చేనేత జనగణన ప్రకారం దేశంలో సుమారు 35.22 లక్షల మంది చేనేత నేసేవారు, అనుబంధ కార్మికులు ఉన్నారు. వీరిలో అధికశాతం గ్రామీణ ప్రాం తాలవారే. మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పించే సంప్రదాయ రంగాల్లో చేనేతది ప్రముఖ స్థానం. గత మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో పనిచేసే కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

కొత్త కుటుంబాలు ఈ వృత్తిలోకి రాకపోగా, పాత కు టుంబాలే ఇతర ఉపాధి మార్గాల వైపు మళ్లుతున్నాయి. వస్త్ర, దుస్తుల రంగం దేశ జీడీపీలో సుమారు రెండు శాతం, పారిశ్రామిక ఉత్పత్తిలో సుమారు 14 శాతం వరకు వాటా కలిగి ఉంది. చేనేత ఆ రంగంలో ఉ పాధి ప్రధానమైన విభాగంగా నిలుస్తోంది. ఒక యంత్రం వందల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయగలదు. కానీ ఒక చేనేత మగ్గం ఒక కుటుంబానికి ఉపాధిని కల్పిస్తుంది. అందుకే చేనేతను ఉత్పత్తి పరిమాణంతో పాటు ఉపాధి సృష్టి, గ్రామీణ అభివృద్ధి కోణంలో చూడాలి.

చేనేత కార్మికుల జీవితంలో అతిపెద్ద స మస్య శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవడమే. ఒక చీరను నేయడానికి వారా లు పట్టినా చివరకు నేసేవారి చేతికి వచ్చే మొత్తం చాలా స్వల్పం. అదే చీర నగరంలోని ప్రదర్శనశాలలో లేదా బ్రాండ్ పే రుతో పలుమార్లు అధిక ధరకు విక్రయమవుతుంది. ఉత్పత్తిదారుడి కన్నా మధ్యవర్తులే ఎక్కువ లాభపడే నిర్మాణం చేనేత రంగాన్ని దశాబ్దాలుగా బలహీనపరుస్తోం ది. ఉత్పత్తి విలువ పెరుగుతున్నా, నేసేవారి ఆదాయం అదే స్థాయిలో పెరగడం లేదు.

ఫలితంగా అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయి. చౌక ధరల్లో దిగుమతి అయ్యే యంత్రాలపై తయారైన వస్త్రాలు మార్కెట్లో ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. చేనేతకు ప్రధాన పోటీ దేశీయ పవర్‌లూమ్ రంగం నుంచే ఎదురవుతోంది. చేతితో నేసిన వస్త్రాన్ని పోలిన న మూనాలను యంత్రాలతో వేగంగా తక్కు వ ఖర్చుతో తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడం వల్ల వినియోగదారుడు అసలు చేనేతను గుర్తించడం కష్టమవుతోంది.

నకిలీ ‘హ్యాండ్లూమ్’ ఉత్పత్తులు నిజమైన చేనేతకు తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి. ముడిసరుకు ధరల పెరుగుదల మరో తీవ్రమైన సమస్య. పత్తి, పట్టు, సహ జ రంగులు, నూలు ధరలు నిరంతరం పెరుగుతున్నా తయారైన వస్త్రానికి మార్కె ట్లో తగిన ధర లభించడం లేదు. ముడిసరుకు ఖర్చు, రవాణా, వడ్డీ భారాలు పెరుగుతుండగా నేసేవారి ఆదాయం మాత్రం స్థిరంగా ఉండిపోతోంది. చిన్న ఉత్పత్తిదారులకు చౌక రుణాలు అందకపోవడం, వర్కింగ్ క్యాపిటల్ కొరత కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయి.

డిజైన్లలో నూతనత లోపించడం కూడా మార్కెట్‌ను పరిమితం చేస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేగంగా మారుతున్నప్పటికీ అనేక చేనేత కేంద్రాలు ఇప్పటికీ సంప్రదాయ నమూనాలకే పరిమితమవుతున్నాయి. సంప్రదాయాన్ని కాపాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త రంగులు, కొత్త న మూనాలు, ఆధునిక దుస్తుల రూపకల్పన చేపట్టినప్పుడే మార్కెట్ విస్తరిస్తుంది.

తక్కువ ఆదాయం, ఎక్కువ శారీరక శ్రమ, సామాజిక గుర్తింపు లేకపోవడం, స్థిరమైన మార్కెట్‌పై అనిశ్చితి, ఇతర రంగా ల్లో మెరుగైన వేతనాలు లభించడం వల్ల చేనేత కుటుంబాలకు చెందిన యువత పట్టణాలకు వలస వెళ్లడానికే మొగ్గుచూపుతోంది. నైపుణ్యం ఉన్న వృద్ధులు ఉన్నా, వారసులు లేని మగ్గాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ సంక్షోభం కొన్నిచోట్ల మరింత విషాదకర రూపం కూడా దాల్చుతోంది.

తక్కువ ఆదాయం, అప్పుల భారం, మార్కెట్ అనిశ్చితి వంటి కారణాలతో దేశంలోని పలు చేనేత కేంద్రాల్లో నే తన్నల ఆత్మహత్యలు వెలుగుచూస్తున్నా యి. అయినప్పటికీ, చేనేత కార్మికుల ఆత్మహత్యలను ప్రత్యేకంగా నమోదు చేసే అధికారిక వ్యవస్థ ప్రస్తుతం లేదు. ఈ విషాద ఘటనలపై ప్రత్యేక గణాంకాలను సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడే సమస్య తీవ్రతను శాస్త్రీయంగా అంచనా వేసి, ఆధారపూర్వకమైన విధానాలు రూపొందించ డం సాధ్యమవుతుంది.

ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం, ముడిసరుకు సరఫరా పథ కం, మార్కెటింగ్ సహాయం, డిజైన్ అభివృద్ధి, చేనేత మార్కులు, ఈకామర్స్ అ నుసంధానం, వర్క్‌షెడ్లు, సామాజిక భద్ర త, రుణ సదుపాయాలు వంటి అనేక కా ర్యక్రమాలు అమలు చేస్తోంది. వీటి వల్ల కొంత ప్రయోజనం కలిగినప్పటికీ, ఈ రంగం ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక స మస్యలతో పోలిస్తే ఇవి సరిపోవడం లేదు.

సుస్థిర అభివృద్ధి, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సా హం, స్వావలంబన వంటి లక్ష్యాలను భార త్ నిజంగా సాధించాలంటే చేనేత బతకాల్సిందే. చేనేతను సంక్షేమ దృక్పథంతో పాటు వ్యూహాత్మక ఆర్థిక రంగంగా కూడా చూడాలి. ఇది భారతదేశానికి సాఫ్ట్ పవర్, గ్రామీణ ఉపాధి, మహిళల సాధికారత, పర్యావరణహిత ఉత్పత్తి, సుస్థిర అభివృద్ధి వంటి అనేక లక్ష్యాలను ఒకేసారి సాధించే సామర్థ్యం కలిగిన రంగం.

ప్రభుత్వ పథకాలు అనేక సందర్భాల్లో నిజమైన కార్మికు డి వరకు సమర్థంగా చేరకపోవడం, సహకార సంఘాల బలహీనత, మార్కెటింగ్ లోపాలు వాటి ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. పాత పథకాల కొనసాగింపుతో పాటు చేనేతను కొత్త ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వంతో నిలబెట్టే రెండో తరం సంస్కరణలు అత్యవసరం. చేనేత ఉత్పత్తులకు ఆదాయ రక్షణ కల్పించే ప్రత్యేక విధానాలను పరిశీలించాలి.

ప్రతి చేనేత ఉత్పత్తికి క్యూఆర్ ఆధారిత డిజిటల్ గుర్తింపును తప్పనిసరి చేసి నకిలీ హ్యాండ్లూమ్ ఉత్పత్తులను అరికట్టాలి. పాఠశాల యూనిఫారాలు, విశ్వవి ద్యాలయ దుస్తులు, ప్రభుత్వ బహుమతు లు వంటి ప్రభుత్వ కొనుగోళ్లలో చేనేతకు నిర్దిష్ట వాటా కల్పించే విధానాన్ని అమలు చేయాలి.

ప్రపంచవ్యాప్తంగా సహజ, చేతితో త యారైన, పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో భారత చేనేతకు అపూర్వ అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వ విధానాలు, మార్కెట్ సంస్కరణలు, వినియోగదారుల అవగాహన, సాంకేతికత ఒకే దిశగా పనిచేయాలి. చేనేతను జ్ఞాపకంగా కాక, జీవన ప్రవాహంగా  నిలబెట్టే విధానాలే నేటి భారత దేశానికి అత్యవసరం.

డి.జె.మోహనరావు