7 August, 2026 | 3:29 AM

జయశంకర్ ప్రోత్సాహంతోనే నిమ్స్‌లో అడుగు పెట్టా..

07-08-2026 02:28 AM

నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్

పంజాగుట్ట, అగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జ యంతి వేడుకలను నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో ఘ నంగా నిర్వహించారు. పాత భవనంలోని లెర్నింగ్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గు ర్తు చేసుకున్నారు. జయశంకర్  అమూల్యమైన సలహా, నిరంతర ప్రోత్సాహంతోనే తాను నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ వైద్య సంస్థలో అడుగు పెట్టానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన అలాంటి మహనీయుడికి ఈ రోజు నివాళులర్పించే అవకాశం లభించడం తనకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సాగించిన సుదీర్ఘ పోరాటం, ఆయన ప్రదర్శించిన సిద్ధాంత బలం, నిబద్ధత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని,హక్కులను కాపాడేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ చంద్ర శేఖర్, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పరంజ్యోతి, విజయ్ కుమార్, మీడియా రిలేషన్స్ ఆఫీసర్ సత్యగౌడ్, అలైడ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రమేష్, డిప్యూటీ రిజిస్ట్రార్ వాణి, దేవదానం, శ్రీనివాస్ రావ్, శ్రీను ప్రశాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.