29 April, 2026 | 3:27 AM

వీధి కుక్కల రక్తంతో వ్యాపారం

29-04-2026 01:24 AM
  1. నగరంలో వెలుగు చూసిన జంతువుల బ్లడ్ రాకెట్
  2. వీధి కుక్కలను బంధించి రక్తాన్ని అమ్ముతున్న ప్రైవేట్ ఆసుపత్రి
  3. ఒక్కో బ్లడ్ ప్యాకెట్కు రూ.25 వేల వరకు అక్రమ వసూళ్లు

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మనుషుల అవయవాలు, రక్తంతో వ్యాపారం చేయడం గురించి విన్నాం. కానీ, ఇప్పుడు కొందరు అక్రమార్కులు మూగజీవాలను కూడా వదలకుండా వాటి రక్తంతో అక్రమ దందాకు తెరలేపిన అమానుష ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. నగరంలోని షేక్పేటలో ఉన్న ఒక ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రిలో వీధి కుక్కల రక్తాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న రాకెట్ను అధికారులు గుర్తించారు. ఈ దారుణంపై జంతు ప్రేమికులు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయడంతో పాటు, జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ సైతం రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చింది.

నగరం లో జంతువుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ రక్త నిధి కేంద్రాలు లేకపోవడమే ఇలాంటి మాఫియాలు పుట్టుకురావడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఫిర్యాదు లు అందడంతో జీహెచ్‌ఎంసీ పశువైద్యాధికారులు ఆసుపత్రిపై దాడులు చేసి, రికార్డు లను, నిల్వ ఉంచిన రక్తపు ప్యాకెట్లను స్వాధీ నం చేసుకున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.