29 April, 2026 | 3:26 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలి

29-04-2026 01:23 AM

నారాయణఖేడ్, ఏప్రిల్ 28: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేయడంతో పాటు ల్యాబ్, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, చెకప్లు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ప్రతి నెల జరిగే ప్రసవాల సంఖ్య తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఎంపీడీవో, మెడికల్ ఆఫీసర్, తదితరులు పాల్గొన్నారు.