05-09-2025 05:10:03 PM
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) శుక్రవారం కీలక పోస్టు చేశారు. భారత్ పై ఆయన మరోసారి తీవ్రమైన అక్కసు వెళ్ళగక్కారు. తమ దేశానికి భారత్ దూరం కావడం చాలా బాధాకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో పాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని ట్రంప్ పేర్కొన్నారు. టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య స్నేహం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేశారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తే భారత్, రష్యాను కోల్పోయామని తాను అనుకుంటునట్లు.. చైనా చీకటి వలయంలో భారత్, రష్యా చిక్కుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. భారత్, రష్యా.. చైనాకు దగ్గరైనట్లు తమకు తెలుస్తుందని.. మోదీ, పుతిన్, జిన్ పింగ్ ఫోటోను ట్రూత్ లో పోస్టు చేశారు. ఆ ముగ్గురు నేతలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా.. అని వ్యాఖ్యలు చేశారు. కాగా, ట్రంప్ భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన తర్వాత భారత్, అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇందులో భారత్ రష్యా ముడి చమురు కొనుగోలుకు 25 శాతం అదనపు సుంకాలు కూడా ఉన్నాయి.