calender_icon.png 6 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్మార్గపు ధరణి

06-09-2025 12:50:58 AM

  1. బీఆర్‌ఎస్ పాలనలో భూదోపిడీ
  2. రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చేసే ప్రయత్నాలు జరిగాయి..
  3. జీపీవోలు ధరణి అక్రమాలను ప్రజలకు వివరించాలి..
  4. ప్రభుత్వానికి పేద ప్రజలకు మధ్య వారధులుగా నిలవాలి..
  5. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  6. జీపీవోలకు నియామక పత్రాల పంపిణీ
  7. సాదాబైనామా సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో దుర్మార్గమైన చట్టాన్ని అమలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తెచ్చి తెలంగాణకు పట్టిన దరిద్రాన్ని వదిలించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో అనాది నుంచి భూపోరాటాలే ఎక్కువగా జరిగాయని, కు మ్రం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొముర య్య, రావి నారాయణరెడ్డి వంటి యోధులు భూమి కోసమే పోరాడారని గుర్తుచేశారు.

ప్రభుత్వం కొత్తగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు(జీపీవో) శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నియామక పత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. వెదిరె రామచంద్రారెడ్డి అనే దాత వేలాది ఎకరాలను నిరుపేదలకు పంచి భూదానోద్య మానికి దోహదం చేశారని గుర్తుచేశారు. పీవీ నర్సింహారావు హయాంలో అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని, తద్వారా అసై న్డ్ భూములను పేదలకు పంచారని వివరించారు.

తెలంగాణలో భూమికి, ప్రజలకు మ ధ్య ఉన్న బంధం.. తల్లీబిడ్డకు ఉన్న సంబంధమని అభివర్ణించారు. భూమి కోసం ప్రా ణాలిచ్చే ప్రాంతం తెలంగాణ అని కొనియాడారు. ప్రాణప్రదంగా భావించే భూమిని దోచుకోవాలని చూసిన బీఆర్‌ఎస్ నేతలను రాష్ట్ర ప్రజలు తరిమికొట్టారన్నారు. గ్రామ పరిపాలన అధికారులు ధరణి పేరుతో జరిగిన అక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇతర శాఖల ఉద్యోగులతో పాటు రెవెన్యూ ఉద్యోగులు స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించారని కొని యాడారు.

రాష్ట్రం సిద్ధించిన తర్వాత వారందరికీ మంచి గుర్తింపు ఇస్తారనుకుంటే, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పనిచేయలేదన్నా రు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎంతోమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినప్పటికీ కార్మికుల సమస్యలు ప రిష్కరించలేదన్నారు. గత ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడి, రెవెన్యూశాఖ సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయ త్నం చేసిందని మండిపడ్డారు.

ధరణి చట్టం తెచ్చిన కష్టాల కారణంగా ఓ రైతు నాడు  రెవెన్యూ అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని గుర్తుచేశారు. ప్రభుత్వానికి పేద ప్రజలకు మధ్య జీపీవోలు వారధులుగా నిలవాలని సూచించారు. భూభారతి చట్టాన్ని ప కడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. సాదాబైనామాలను అమలు చేయాల్సిన బా ధ్యత కూడా జీపీవోలదేనని తెలిపారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ పరిపాలన అధికారులను నియమించామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్వోఆర్ చట్టం, అమలు చసిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సుదీర్ఘమైన చర్యల తర్వాత భూభారతి చట్టానికి రూపకల్పనకు చేశామన్నారు.

సాదాబైనామా సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వ హయాంలో  9.26 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటికి పరిష్కారం లభించలేదన్నారు. కేసుల పరిష్కారం కోసం వందలాది మంది న్యాయస్థానాలను ఆశ్రయించారని తెలిపారు. తమ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సదస్సులలో సుమారు 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని స్పష్టం చేశారు.

వారం రోజుల క్రితం న్యాయస్థానం ద్వారా సాదాబైనామాలపై ఉన్న స్టేను తొలగించి సఫలమయ్యామని తెలిపారు. రాష్ట్రాన్ని 6,860 క్లస్టర్లుగా విభజించి గ్రామ పరిపాలనాధికారులను నియమించామన్నారు. త్వరలో సర్వేయర్ల నియమించి, భూ సమస్యలకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు. ఉగాదిలోగా సర్వేయర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 

కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం..

దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్ట్‌లు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నదని పేర్కొన్నారు. నాడు నిజాం నవాబ్‌లకు గుణపాఠం చెప్పిన విధంగానే, బీఆర్‌ఎస్ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని, వారి ఆకాంక్షల మేరకే పాలన సాగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సాదాబైనామాల సమస్య పరిష్కరిస్తామని మరోసారి హామీఇచ్చారు. ‘మీ మీద పడిన మచ్చను చెరుపుకొనే అవకాశం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. ఆ ముద్రను చెరిపేసుకునే బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అని భరోసానిచ్చారు.