06-09-2025 12:47:42 AM
మహబూబాబాద్/ హుజూరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చివరకు కూపన్ల కోసం మహిళా రైతులు సిగపట్లకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. సొసైటీ వద్ద యూరియా బస్తాల కోసం వచ్చిన ఇద్దరు మహిళా రైతుల మధ్య తగాదా చెలరేగి చివరకు సిగపట్లకు దిగారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.
ఇద్దరు మహిళలు కొట్టుకోవడంతోపాటు నడిరోడ్డు వరకు ఒకరి సిగలు మరొకరు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లారు. చివరకు కొందరు కలుగజేసుకొని వారిని వారించారు. యూరియా కోసం ఇంతకాలం రైతులు క్యూలైన్‌లో నిలబడటం, లేదంటే రోడ్డెక్కి ఆందోళన చేయడం, మరి ఇబ్బంది అయితే నిరసన వ్యక్తం చేయగా, వ్యక్తిగత ఘర్షణకు దారి తీయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇద్దరు మహిళలు జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద శుక్రవారం రైతులు, మహిళా రైతులు తెల్లవారు జామునుంచే బారులు తీరారు. యూరియా అందించకుంటే పంటలు చేతికందవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సరిపడా యూరియా పంపిణీ చేయలేదని టైమ్ మించిపోతే ఎరువులు వేసినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. నిల్చునే ఓపిక లేక ఓ రైతు లైన్ లో చాప వేసుకొని కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. అధికారులు చొరవ తీసుకొని రైతులకు సరిపడా ఎరువులు అందచేయకపోతే రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు.