2 April, 2026 | 7:05 PM

ప్రైవేటు టీచర్ల బతుకు వెతే!

06-09-2025 01:59 AM

-చాలీచాలని వేతనాలు 

-పింఛను, ఆరోగ్య బీమా ఉండవు

-కార్మిక చట్టాల అమలు కలే 

-యునెస్కో నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రైవేటు టీచర్లూ కీలక భాగస్వాములే. అయితే ప్రైవేట్ టీచర్లకు కనీస ఉద్యోగ భద్రతనిచ్చే ఒప్పందాలేవీ ఉండ వు. మరో విషాదం ఏమిటంటే, వారికి సరైన వేతనాలూ కరువే. మన దేశంలో 42 శాతం మంది ప్రైవేట్ టీచర్లకు ఉద్యోగ భద్రతనిచ్చే కాంట్రాక్టులేవీ లేవు. మొత్తంగా 62 శాతం మంది టీచర్లు.. గ్రామీణ ప్రాంతాలను కలుపుకొని ఉద్యోగ భద్రత లేకుండానే విధులు నిర్వ హిస్తుంటారు.

వారి నెలసరి జీతం పదివేలకంటె తక్కువే. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో వేతనాలు మరీ తక్కువ. వారికి నెలకు ముట్టేది సరాసరి 8212 రూపాయలు మాత్రమే. వీరిలో మహిళా టీచర్ల సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా ప్రైమరీ స్థాయిలో నూటికి ౯౯ శాతం మహిళా టీచర్లే ఉంటారు. కార్మిక చట్టాలేవీ వీరికి వర్తించవు. వేతనాలకు బదులుగా వారికి ప్రతినెల ‘గౌరవ’ వేతనం లభిస్తుంటుంది. ఇదేమని అడిగితే ఉపాధ్యాయ వృత్తి ‘గౌరవం’ కోసమేనని భావన కల్పిస్తుంటారు.

ఇంటిపనులు చేసుకొని ఒళ్లు హూనం చేసుకొనే మహిళలు ప్రైవేటు స్కూళ్లల్లో అతి తక్కువ వేతనానికే లెక్కలేనన్ని గంటలు పనిచేయాల్సి వస్తుంది. పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి ఖర్చులకు ప్రైవేటు స్కూళ్లల్లో టీచర్లుగా చేరేవారికి అప్పుడప్పుడు బస్సు చార్జీలు కూడా కరువవుతుంటాయి. ఐక్యరాజ్య సమితి వైజ్ఞానిక, సాంసృతిక సంస్థ (యునెస్కో) భారత్‌లో ప్రైవేట్ టీచర్ల దీనస్థితిపై ‘స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా’ పేరిట విడుదల చేసిన నివేదికలోని కటోర వాస్తవాలివి.

ఫీజుల రూపంలో ప్రతియేటా లక్షలాది రూపాయలు వసూలు చేసే ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తమ రాబడిలో అతి తక్కువగా ౨ శాతానికి మించి టీచర్లకు వేతనాలుగా చెల్లించడం లేదు. డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు లభించే వేతనాల కంటే ప్రైవేటు టీచర్లకు లభించేది తక్కువే. పెన్షన్, ఆరోగ్య బీమా ప్రయోజనాల గురించి  ప్రైవేటు టీచర్లు ఆలోచించడం అనేదే కల. జ్వరం వచ్చినా, జబ్బు చేసినా సెలవు పెట్టే పరిస్థితి ఉండదు. కరోనా విపత్కర పరిస్థితిలో చాలా మంది ప్రైవేటు టీచర్ల వేతనాల్లో సగం కంటే ఎక్కువ కోత పెట్టారు. ఈ నేపథ్యంలో ఒడిశా, మిజోరాం రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ దినోత్సవాలను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. కొన్ని నెలలుగా సరైన వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.