calender_icon.png 1 May, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్కువ మార్కులకు నిరాశ చెందొద్దు

01-05-2025 01:30:29 AM

గిత్యాల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల సందర్భంగా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ చెందవద్దని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్  సూచించారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఫలితాలపై ఒత్తిడికి లోనవకూడదన్నారు. 

జీవితంలో ఎవరికైనా గెలుపోటములు సహజమని, పరీక్ష ఫలితాలను కూడా అలాగే స్పోర్టివ్’గా తీసుకోవాలన్నారు. అనవసర ఆలోచనలతో మానసిక ఒత్తిడికి గురిగావద్దని, ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలను తీసుకోవద్దని ఎస్పీ హితవు పలికారు.  తక్కువ మార్కులు వచ్చాయని నిరాశ చెంది ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే, అలాంటి నిర్ణయాలు తల్లిదండ్రులు, సమాజం, విద్యారంగం చింతించే విధంగా మారుస్తాయన్నారు.

పరీక్షలలో మార్కులు జీవితానికి తుది నిర్ణయం కావని, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే జీవితంలో ఓడినట్టు కాదని, మార్కులు కేవలం కొలమానం మాత్రమేనని, జీవితం మరెన్నో అవకాశాలతో నిండి ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంలో పిల్లలకు మానసిక ధైర్యం కల్పించే విదంగా తోడుగా ఉండి, వాళ్లను ప్రోత్సహించాలని ఎస్పీ పేర్కొన్నారు.

పెద్దలు విఫలతలను  అంగీకరించి, దాన్ని మించిన విజయాల వైపు దారి పిల్లలకు చూపాలని ఎస్పీ అశోక్ కుమార్ హితవు పలికారు. ఈ సందర్బం గా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పోలీస్ శాఖ పక్షాన ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.