07-07-2025 01:56:15 AM
గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పంజాల జైహింద్ గౌడ్
ఘట్ కేసర్, జూలై 6 : తాటి చెట్లను నరికి వేసి గీత కార్మికుల పొట్ట కొట్టొద్దని గీత కార్మిక సం ఘం రాష్ట్ర నాయకుడు పంజాల జైహింద్ గౌడ్ అన్నారు. పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 311, 312, 313, 324, 326 2, 327/ పి లో దాదాపు 12 ఎకరాల్లో హెచ్‌ఎండిఎ లేఔట్ చేస్తున్న నిర్వహకులు కొర్రెముల గీత కార్మిక సంఘానికి ఎ లాంటి సమాచారం ఇవ్వకుండా 85 తాటి చెట్లను తొలగించినందుకు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు.
ఆదివారం దీక్షా శిబిరానికి హాజరైన గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు జైహింద్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతితో పాటు జిల్లా కలెక్టర్ నుంచి ఎన్‌ఎసి తీసుకున్నప్పటికీ గీత కార్మిక సంఘం తీర్మానం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. తాటి చెట్లను తొలగించేందుకు ఒక్కో చెట్టుకు దాదాపు రూ. 897 వందల చొప్పున 85 చెట్లకు సుమారు రూ. 80 వేలు సంఘానికి చెల్లించడం సరైన పద్దతి కాదన్నారు.
తాతలనాటి నుండి 85 తాటి చెట్లను నమ్ముకొని 300 పైగా కుటుంబాలు జీవనం పొందుతున్నాయని ఇప్పుడు ఉన్నట్టుండి చెట్లను తొలగిస్తే బాధిత కుటుంబాలు ఎలా ఉపాధి పొందుతాయని ఆయన ప్రశ్నించారు. ఎక్సైజ్ అధికారులు గీత కార్మిక సంఘాలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం అధికారుల అవినీతి లంచగొండి తనానికి నిదర్శనం అన్నారు.
ఈ కార్యక్రమంలో కొర్రెముల గీత కార్మిక సంఘం అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు బుర్ర వెంకటేశం, మాజీ సర్పంచ్ బైరు రాములుగౌడ్, పల్లె బాబురావుగౌడ్, బండ్లగూడం అనిల్ గౌడ్, బైరు పాండుగౌడ్, కట్ట ఆంజనేయులుగౌడ్, దేశగోని బాలరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
బిజెపి నేత సంఘీభావం
బిజెపి నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్న గీత కార్మికులకు సంఘీభావం తెలిపారు. నరికివేసిన తాటి చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈత కార్మి కులు ఉపాధి కోల్పోయినందున వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.