07-07-2025 12:09:38 AM
నల్లగొండ టౌన్, జూలై 6 : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యస్తు డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు ఏఐసీసీ సిద్ధమవుతుంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అధ్యక్ష పదవి కీలక పాత్ర ఉంటుందిగనుక ఆ పోస్ట్కు యమా క్రేజ్ పెరిగింది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కార్పొరేషన్ పదవుల మీద సీరియస్గా ద్రుష్టి పెట్టిన నల్లగొండ నేతలు తాజాగా రూట్ మార్చి డిసిసి పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం పలువురికి రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు కట్టబెట్టింది. ఇక్కడి నాయకులకు కొందరికి ఆ ఆఫర్ ఇచ్చినా అది వద్దనుకుని డీసీసీ రేస్లో కొందరు ఉన్నారు.
సీనియర్ నేతలు ప్రయత్నాలు...
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల ప్రయత్నాలు ఒక ఎత్తయితే మా వాళ్ళకే ఇప్పించుకోవాలంటూ సీనియర్స్ చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కావు. సీనియర్ నేత జానారెడ్డి శిష్యుడిగా ముద్ర ఉన్న శంకర్ నాయక్ రెండు సార్లు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో పోస్ట్ ఖాళీ అయింది. ఈ క్రమంలో డీసీసీ పీఠం దక్కాలంటే సీనియర్ నేతల ఆశీస్సులు ఉండాల్సిందేనని పలువురు చర్చించుకుంటున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అనుచరుడిగా ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని తిరస్కరించారు. తనకు జిల్లా అధ్యక్ష పదవి మాత్రమే కావాలని బహిరంగంగానే చెబుతున్నారు. ఆయనకు పలువురు నేతలు మద్దతు ప్రకటించడం కొసమెరుపు. మరోవైపు డీసీసీ అశిస్తున్న జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్యకు కూడా ఉపాద్యక్ష పదవి వద్దని డీసీసీ పీఠం వైపే మొగ్గుతున్నారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు డీసీసీ ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు సమాచారం. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన జాల నరసింహారెడ్డి, మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీసీ నేత పున్నా కైలాష్ కూడా డీసీసీ రేస్లో ఉన్నట్టు వినికిడి. నిన్న మొన్నటిదాకా ఈ పదవిపై పెద్దగా ఆసక్తి చూపని నాయకులు ఇప్పుడు రూట్ మార్చి ఓ రేంజ్లో పైరవీలు మొదలు పెట్టడం వెనక పెద్ద కథే ఉందని సొంత పార్టీ నేతలు అంటున్నారు.
సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణం...
రాబోయేది స్థానిక ఎన్నికల కాలం పార్టీ బీ ఫామ్స్ అన్ని డీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా పంపిణీ అయ్యే అవకాశం ఉండటం వల్లే ఈ క్రేజ్ అన్నది విస్తృతాభిప్రాయం. పీఠాన్ని దక్కించుకునేందుకు కొందరు తమ నేతను దాటి మరో సీనియర్ నేత ఆశీస్సుల కోసం వెళ్తుండటంతో సీనియర్స్ మధ్య ఆధిపత్యపోరుకు తెరలేచే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు వరుసగా రెండు సార్లు డీసీసీ పీఠం ఎస్టీలకే దక్కడంతో ఈసారి ఆ లెక్కమారాల్సిందేనని పలువురు నేతలు పట్టుబడుతున్నారు. ఈసారి ఓసీలకే ఇవ్వాలని కొందరు, బీసీ, ఎస్సీలకు అసలు అవకాశమే ఇవ్వారా అని మరి కొందరు పార్టీ పెద్దలను నాయకులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
ప్రస్తుత పరిస్దితుల్లో డీసీసీ పీఠంపై కూర్చుంటే చాలా లాభాలుంటాయని నాయకులు భావిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. దీంతో ఆ నేతల ఎత్తుగడలు జిల్లా సీనియర్ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయి.
తమ అనుచరుడికే డీసీసీ పీఠం ఇప్పించుకోవాలన్న పట్టుదల సీనియర్స్లో పెరిగేలా ప్రభావితం చేస్తున్నారని సమాచారం. దీంతో డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుంది. జిల్లా సీనియర్ నేతలు ఎవరివైపు మొగ్గు చూపుతారు.ఎవరి అనుచరుడికి ఆ అదృష్టం ఎవరికి వరిస్తుందంటూ విశ్లేషణలు, రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.