calender_icon.png 10 January, 2026 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులకు ఇబ్బందులు కలగనీయొద్దు

09-01-2026 12:00:00 AM

గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా జాతర

సీఎం చేతుల మీదుగా గద్దెల పునః ప్రారంభం

సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు

ములుగు, జనవరి8(విజయక్రాంతి): గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా జాతరను నిర్వహించాలని,రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటి చెప్పాలని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా గద్దెల పునః ప్రారంభం చేస్తామని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. గురువారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు,  కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్,ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా,డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31వతేదీ వరకు జరుగుతుందన్నారు.

మొదటి రోజు సాయంత్రం 6గంటలకు కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను,కొండాయి నుంచి గోవిందరాజు,పునుగొండ్ల నుంచి పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుందన్నారు. 29న సాయంత్రం 6గంటలకు చిలకల గుట్ట నుంచి పూజారులు సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారని, 30న వన దేవతలకు భక్తులు తమ మొక్కులను చెల్లిస్తారని,31న సాయంత్రం 6గంటలకు సమ్మక్క,సారలమ్మ దేవతలు,గోవిందరాజు,పగిడిద్దరాజు వనదేవతలు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని తెలిపారు.

మేడారం జాతరకు 3కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రణాళికలను సవివరంగా కలెక్టర్ సమీక్ష సమావేశంలో వివరించారు.వీఐపీ వాహనాలు,ఆర్టీసీ బస్సులు,పస్రా తాడ్వాయి మీదుగా మేడారానికి చేరుకుంటాయని,కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్ మీదుగా వచ్చే వాహనాలు కాటారం - కల్వపల్లి మీదుగా మేడారం చేరుకుంటాయని హైదరాబాద్ వరంగల్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు పసర మీదుగా చేరుకుంటాయని ఎస్పీ తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రత్యేకంగా రహదారులు, పార్కింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.