మనిషి తనలోని ఆలోచనలతోనే పిచ్చోడయిపోయే పరిస్థితులున్నాయి ఈ రోజుల్లో. అలాంటిది ఒక వ్యక్తి మెదడులోకి మరో వ్యక్తి ఆలోచనలు, జ్ఞాపకాలను ఎక్కిస్తే ఆ మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ ఎలా ఉంటుందో మా సినిమాలో చూడండి అంటున్నారు కథానాయకుడు రామ్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించి తన పాత్రకు డబ్బింగ్‌ని పూర్తి చేశారు హీరో రామ్.
సినిమాలోని “మామా.. మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనబడతాడు” అనే డైలాగ్ చెబుతున్న వీడియోతో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ ఈ విషయాన్ని తెలిపారాయన. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయిక. మణిశర్మ స్వరకల్పనలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గీతాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆగస్టు 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు నిర్మాణ వర్గాలు తాజాగా తెలిపాయి.