17-01-2026 06:22:41 PM
సుల్తానాబాద్ ఎస్సై అశోక్ రెడ్డి, ఏఎస్ఐ కరుణాకర్
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై అశోక్ రెడ్డి, ఏఎస్ఐ కరుణాకర్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చిన్న వయస్సు నుంచే రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
అలాగే నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించడం ఎంతో అవసరమని సూచించారు. వేగ నియంత్రణ పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పకుండా పాటించాలని విద్యార్థులకు వివరించారు.డ్రాయింగ్ పోటీల ద్వారా విద్యార్థులు రోడ్డు భద్రతపై చక్కటి సందేశాలను చిత్రాల రూపంలో తెలియజేశారని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మునిందర్, అలీ,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.