calender_icon.png 17 January, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు

17-01-2026 06:33:13 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు ఆసుపత్రి చరిత్రలో మొట్టమొదటి సీజేరియన్ (పెద్దా ఆరేషన్) చేసి ఆసుపత్రి వైద్యులు చరిత్ర సృష్టించారు. సారపాకకి చెందిన బానోత్ మమత అనే 26 ఏళ్ల మహిళకి మొదటి కాన్పు సీజేరియన్ కాగా రెండో కాన్పు కోసం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరగా పరీక్షించిన ప్రసూతి వైద్యురాలు డా.అనూష లక్ష్మి శనివారం సిజేరియన్ ఆపరేషన్ చేసి పండంటి 3 కేజీల మగబిడ్డకు పురుడుపోసారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఆసుపత్రిని 2022 లో వైద్య విధాన పరిషత్ లోకి 30 పడకల ఆసుపత్రి గా మార్చారు. కాకపోతే 30 పడకల కి సరిపడా భవనం, మౌలిక సదుపాయాలు మంజూరు కాలేదు. స్థానిక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు సూచన మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ చూపి ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్ కి అవసరమైన పనిముట్లు సమకూర్చారు. జిల్లా ఆసుపత్రుల ప్రధాన సమన్వయ అధికారి డాక్టర్ రవి బాబు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతం లో ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులను, ఇటీవలే ఒక ప్రసూతి వైద్యురాలిని నియమించారు.

అలాగే 24 గంటల వైద్య సదుపాయాలు, రక్త పరీక్షల యంత్రాలు, డెంటల్ పరికరాలు ఏర్పాటు చేశారు. వైద్యులు అందుబాటులో లో ఉండడం తో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సుమారు రెండు కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో నూతన ఆసుపత్రి భవంతి ని ఆరునెలల క్రితం స్థానిక ఎం ఎల్ ఏ ప్రారంభించగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రికి లో మొట్టమొదటి సీజేరియన్ ఆపరేషన్ జరగడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

మెరుగైన సేవలు అందించేందుకు కృషి

-ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరావు

గత ఒక సంవత్సరం నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని,ఇప్పుడు పెద్దపరేషన్ చేయడం వల్ల పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతున్నాయని, సేవలు మెరుగు పరచడానికి ఎం ఎల్ ఏ పాయం వెంకటేశ్వర్లు,జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, డీసీఎచ్ఎస్ రవి బాబు నిరంతర పర్యవేక్షణ లో అన్ని విధాలుగా ఆసుపత్రి ని అభివృద్ధి చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరావు తెలిపారు.

సేవలు మరింత విస్తృతం చేస్తాం: డీసీహెచ్ఎస్ రవి బాబు

ఇటీవలే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్ల మరియు జిల్లాలో ఇతర వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరును రాష్ట్ర సచివాలయం లో సమీక్షించి వైద్య సిబ్బంది ని జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలను ప్రత్యేకంగా అభినందించారనీ, ఏ జిల్లాలో లేని విధంగా ఈ ఆపరేషన్ తో జిల్లాలో లోని ఉన్న ఏడు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో సైతం ఆపరేషన్ థియేటర్ సేవలు, ప్రసూతి సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు అయిందని డీసీ హెచ్ఎస్ రవి బాబు తెలిపారు.

త్వరలోనే బూర్గంపాడులో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అతి త్వరలోనే నూతన ఆసుపత్రి భవంతి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. బుర్గంపాడు ప్రజలు సిజేరియన్ ఆపరేషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఇక లేదని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న డీసీహెచ్ఎస్ డా రవి బాబు సిబ్బందిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాం నాయక్, టీవీవీపీ రాష్ట్ర కమీషనర్ డా అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్,  అభినందించారు.