04-08-2025 12:52:42 AM
జూలైలో డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన నిందితులకు శిక్ష విధించడంపై
స్పెషల్ ఫోకస్ ములుగు జిల్లా ఎస్పీ శబరిష్.పి
ములుగు,ఆగస్టు3(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా మరియు జైలు శిక్ష తప్పవని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి హెచ్చరించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా గత నెల(జూలై)లో 456 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలియచేశారు.
ఇకపై కేసులు నమోదు చేయడంతో పాటు నిందితులకు శిక్ష విధించడంపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియచేశారు గడిచిన వారంలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 17మంది మందుబాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్ట్ ద్వారా ఈ17మందికి 2రోజుల జైలు శిక్షతో పాటు 2వేల రూపాయల జరిమానాలు విధించడం జరిగింది అని తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే అట్టి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని,జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,తరచు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారస్సు చేయడం జరుగుతుందన్నారు.
తాగి వాహనాలు నడపవద్దని తద్వారా జరిగే ప్రమాదాలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులు చితికిపోయే అంశాలపై పోలీస్ శాఖ వారు కౌన్సిలింగ్ ద్వారా వివరించడం, పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది అని అన్నారు. మద్యం సేవించి మొదటిసారి పట్టుబడిన, రెండవసారి పట్టుబడిన వారు సేవించిన మద్యం మోతాదులను బట్టి తప్పనిసరిగా శిక్షలు విధించబడతాయి అని తెలియజేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు,ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణపైన,
మద్యం తాగి వాహనాలు నడిపేవారిపైన కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారికి నిరంతరం కౌన్సిలింగ్లు ఇవ్వడం, సూచనలు చేయడం జరుగుతుందన్నారు. అంతే కాక పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకమై పాటించాల్సిన నియమాలు వివరించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.