04-08-2025 01:20:04 AM
ఇప్పటికీ ప్రమాదం, పరిహారంపై కొరవడిన స్పష్టత
- ఘటనపై నియమించిన కమిటీ గడువు సైతం పూర్తి
- ఘటనపై హైకోర్టులో పిల్ వేసిన రిటైర్డ్ సైంటిస్ట్ కే బాబురావు
- భద్రతా, పర్యవేక్షణ లోపాలే కారణమని పిటిషనర్ వాదన
- ఇంకా ఎవర్నీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేసిన ప్రభుత్వం
- కంపెనీలో పనిచేసే కార్మికుల పూర్తి వివరాలు సమర్పించాలి
-మూడువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాం తి): పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి నెల రోజులు దాటినా ఇప్పటికీ ఘటనకు సంబంధించి నిపుణుల కమిటీ వేయడం తప్ప ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ గడువు కూడా ఆగస్టు 2తో పూర్తయింది. కానీ ఇప్పటికీ ప్రమాదానికి గల కారణాలు, బాధితుల కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై స్పష్టత కొరవడింది.
ఈ అంశంపై తాజాగా కీలక పరి ణామం చోటు చేసుకుంది. సిగాచి కంపెనీలో జరిగిన ఘటనపై తెలంగాణ హైకో ర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైం ది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) లో పనిచేసి పదవీ విరమణ పొందిన సైంటిస్ట్ కే బాబురావు ఈ పిల్‌ను దాఖలు చేశారు.
సిగాచి పరిశ్రమలో సంభవించిన పేలుడుపై ప్రత్యేక చొరవ చూపించి, ప్రమాదానికి గల కారణాలను బహిర్గతం చేయడంతోపాటు బాధితులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగి నెల దాటింది. 45 మంది కార్మికులు మృతి చెందగా, 8 మంది కార్మికుల ఆచూకీ లేదు. అయినా ఇటు ప్రభుత్వం, అటు కంపెనీ యాజమాన్యం పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం హైకోర్టు జోక్యంతోనైనా సమస్య పరిష్కారం అవుతుందేమోనని బాధితులు ఎదురు చూస్తున్నారు.
వ్యాజ్యంతో విజ్ఞప్తి..
సిగాచి ఫ్యాక్టరీ పేలుడుపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కే బాబురావు న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదని, బాధితుల కుటుంబాలకు ఇంకా పూర్తి పరిహారం చెల్లించలేదని పిటిషనర్ ప్రస్తావించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీల నివేదికలను విడుదల చేయాలని కోరారు. త్వరిత దర్యాప్తును కూడా కోరారు.
భద్రతాపరమైన ఆడిట్‌లు లేకపోవడం, మండే ధూళి ప్రమాదాలను గుర్తించడంలో వైఫల్యం, కంపెనీ భద్రతా డేటా షీట్‌లో తప్పుగా ప్రస్తావించడం పేలుడుకు ప్రత్యక్షంగా కారణమని పిటిషనర్ వాదించారు. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు లేదా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఫ్యాక్టరీలో సంభవించబోయే ప్రమాదాన్ని స్పష్టంగా గుర్తించలేదని ఆరోపించారు. ఫలితంగా వ్యవస్థాగతనియంత్రణ వైఫల్యం సంభవించిందని తెలిపారు. బాధిత కార్మికులందరూ స్థానికులు కాదని, వారు పర్మనెంట్ కాకుండా ఎక్కువగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వలస కార్మికులేనని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
కౌంటర్ దాఖలు చేయాలి..
సిగాచి ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు లేకపోవడం, పేలుడు ప్రమాదంలో ఆలస్యంగా దర్యాప్తు, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో జాప్యాన్ని సవాలు చేస్తూ కే బాబురావు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, న్యాయమూర్తి జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది.
ఎఫ్‌ఐఆర్‌ను ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు, దర్యాప్తు నిర్వహించడంలో పురోగతి గురించి ఈ సందర్భంగా ఆరా తీశారు. ఇప్పటివరకు ఎవరినినైనా అరెస్ట్ చేశారా అని ప్రభుత్వ తరఫున న్యాయవాదిని ప్రశ్నించారు. హోంశాఖ, ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ అరెస్ట్ చేయలేదని సమాధానమిచ్చారు. ప్రాణనష్టాన్ని పరిశీలించిన హైకోర్టు సిగాచి ఇండస్ట్రీస్ బాధ్యత వహించగల చట్టాలు, చెల్లించిన పరిహారం, ప్రమాదం జరిగిన రోజున ఫ్యాక్టరీలో ఉన్న కార్మికుల సంఖ్య, వారు శాశ్వత, సాధారణ, రోజువారీ వేతన కార్మికులా అనే అంశాలపై సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరి ప్రభుత్వం ఏం చేస్తుంది..
సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సమాధానాలతో రాష్ట్ర ప్రభుత్వ తీరు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవర్ని అరెస్ట్ చేయలేదు. ఘటనలోని నిజాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీల నివేదికల కోసం ఎదురు చూడటం లేదని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. మరి ప్రభుత్వం ఎందుకు వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనకు గల కారణాలను వెలికితీసి, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 105, సెక్షన్ 110, సెక్షన్ 117 కింద సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పుడు, చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా, నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. కమిటీ నివేదికల కోసం వేచి చూడనప్పుడు వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు జోక్యంతోనైనా సిగాచి బాధితులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
కమిటీ నివేదికలపై హైకోర్టు ఆరా..
ప్రమాదంపై ఉన్నతస్థాయి కమి టీ, నిపుణుల కమిటీ నివేదికల కో సం తాము ఎదురుచూస్తున్నట్టు రా ష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే ఈ రెం డు కమిటీల ఫలితాలపై దర్యాప్తు ఆ ధారపడి ఉంటుందా అని కోర్టు ప్ర శ్నించింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ కమిటీ నివేదికల కోసం వేచి చూ డటం లేదని సమాధానమిచ్చారు. రాష్ర్టం దీనిని వ్యతిరేక వ్యా జ్యంగా పరిగణించకూడదని, మరణించిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయడానికి రాష్ర్టం తన వంతు కృషి చేయాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు.
ప్రజా ప్రయోజన వ్యా జ్యంలో లేవనెత్తిన అన్ని అంశాలను కవర్ చేసేలా సమగ్రమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయడానికి నాలు గు వారాల సమ యం అవసరమని అదనపు అడ్వకే ట్ జనరల్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశా రు. అయితే ఇది ముఖ్యమైన విషయమని, మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది. విచారించిన తర్వాత తెలంగాణ హైకోర్టు రాష్ర్ట పరిశ్రమ, కార్మిక, హోం శాఖ లు, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది.