calender_icon.png 18 November, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల వినియోగాన్ని అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

18-11-2025 01:04:36 PM

జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

గద్వాల: యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సూచించారు. మంగళవారం ఐ.డి.ఓ.సి సమావేశం హాల్ నందు నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల, వినియోగంపై అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు 2020 నుంచి నషాముక్త్ భారత్ అభియాన్‌ను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు.

భవిష్యత్ తరాలు పూర్తిగా డ్రగ్స్‌ రహిత భారతదేశంలో స్వేచ్ఛగా  జీవించాలన్నదే నషాముక్త్ భారత్ అభియాన్ యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ అభియాన్ ప్రారంభమై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మాదక ద్రవ్యాలు వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబ సౌఖ్యాన్ని, సమాజ స్థిరత్వాన్ని కూడా దెబ్బతీస్తాయని తెలిపారు. అందువల్ల యువతను క్రీడలు, చదువు మరియు మంచి అలవాట్లు అలవర్చుకొనేలా ప్రోత్సహించడం అత్యంత అవసరమని అన్నారు.

మాదక ద్రవ్యాలకు ప్రభావితమైన వారిని  మహమ్మారి వ్యవసనాల నుండి బయట పడే విధంగా పునరావాస కేంద్రాలు కూడా నిర్వహించబడుతున్నాయన్నారు. ప్రతి నెలా మాదకద్రవ్యాల నియంత్రణపై సమావేశాలు నిర్వహిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టి పరిస్థితులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్ధేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని, ప్రజలను ప్రధాన భాగస్వాములను చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న నషాముక్త్ భారత్ అభియాన్‌ను అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అధికారులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఏ ఓ భూపాల్ రెడ్డి,  జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.