18-11-2025 01:00:10 PM
అదనపు కలెక్టర్ నర్సింగరావు
గద్వాల: దేశ సమగ్రతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్య సాహసాలు మనందరిలో ప్రతినిత్యం ఐక్యత స్ఫూర్తిని కలిగిస్తాయని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్, ఆత్మ నిర్భర భారత్ నినాదంతో, నెహ్రూ యువ కేంద్రం మహబూబ్ నగర్ వారి సహకారంతో మంగళవారం గద్వాల తేరు మైదానం నుంచి పట్టణ పురవీధుల మీదుగా యూనిటీ మార్చ్ (జిల్లాస్థాయి ఐక్యత పాదయాత్ర) నిర్వహించారు.
ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ నర్సింగరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, భారతమాత, వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకుంటూ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ జీవిత చరిత్ర పుస్తకాలు చదివితే ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బ్రిటిష్ వాళ్లు దేశ విభజన చేయడంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 565 సంస్థానాలలో హైదరాబాద్, జునాగడ్, కాశ్మీర్ రాజులు భారత యూనియన్ లో తమ సంస్థానాలను కలిపేందుకు నిరాకరించడంతో సర్దార్ చాకచక్యంగా వ్యవహరించారన్నారు. ఆయన కృషి ఫలితంగానే నేడు మన దేశం ఐక్యతతో విరాజిల్లుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు కులాలు, మతాలు, జాతుల ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వివిధ సంస్కృతి సంప్రదాయాలు కలిగిన, అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నప్పటికీ ఎలాంటి వైరుధ్యాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ కలిసికట్టుగా జీవిస్తున్నామన్నారు. ఏక్ భారత్, ఆత్మ నిర్భర భారత్ నినాదంతో 2047 సంవత్సరం నాటికి మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.
ఇప్పుడు విద్యార్థులు గా ఉన్న పిల్లలే అప్పటివరకు యువతగా మారి దేశాభివృద్ధిలో తన వంతు కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులను స్మరించుకుంటూ, దేశ సమైక్యతకు బాటలు పరిచిన గొప్ప వాళ్లను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి కోటా నాయక్, గద్వాల మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, పాదయాత్ర కమిటీ కన్వీనర్ బండల వెంకట్ రాములు, కో కన్వీనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు, యువత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.