04-01-2026 12:03:29 PM
డ్రంక్ అండ్ డ్రైవ్.. ఆపితే ఆటోలోంచి పాము తీశాడు
హైదరాబాద్: నగరంలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని తనిఖీ చేస్తున్న సమయంలో పట్టుబడిన ఒక తాగుబోతు, ట్రాఫిక్ పోలీసులను పాముతో బెదిరించాడు. పోలీసుల ప్రకారం, ఇర్ఫాన్ అనే ఆటో రిక్షా డ్రైవర్‌ను చంద్రాయణగుట్ట వద్ద మద్యం తాగి వాహనం నడుపుతున్నాడన్న అనుమానంతో పోలీసులు ఆపారు.
బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతను మద్యం సేవించినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ కోపంతో ఆటో రిక్షాలోంచి ఒక పామును తీసి, తన ఆటోను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. "ఇర్ఫాన్ ఒక చనిపోయిన పామును తీసుకువచ్చి ట్రాఫిక్ పోలీసు అధికారులకు చూపించి, తన వాహనాన్ని తనకు అప్పగించమని డిమండ్ చేశాడు. మా సిబ్బంది అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు," అని ఒక ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.