05-01-2026 02:23:14 PM
ప్రజావాణి లో దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన ఇండ్ల కొమురయ్య ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తుమ్మల సుధాకర్ రెడ్డి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 204 లో 20 గుంటల విస్తీర్ణ భూమి ఇతరులకు పేరు మీద ఉందని దానిని తన పేరు కు నమోదు చేయాలని కొరుతూ దరఖాస్తు చేసుకోగా ఎలిగేడు తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఇందారపు శంకరమ్మ డిసెంబర్ 20, 2025 న ఇల్లు కాలిపోయిందని , తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపిడిఓ మంథని కు రాస్తూ వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. రామగుండం మండలం అడ్డగుంటపల్లి గ్రామానికి చెందిన ఉమ్మగాని సమ్మయ్య తన పేరు మీద ఉన్న గుంట భూమి కోసం తన కుమారుడు భౌతిక దాడి చేస్తున్నాడని, తనను రక్షించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డీవో పెద్దపల్లి రాస్తూ వృద్దుల సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.