13 March, 2026 | 8:39 AM

కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవీందర్ తీరుపై దుర్గాప్రసాద్ నాయక్ ఆగ్రహం

13-03-2026 12:00 AM

పర్యావరణాన్ని కాపాడమంటే నిర్లక్ష్య సమాధానాలా?

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 12, (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం, గుట్ట కింద గుంపు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ కొండల తవ్వకాలను అడ్డుకోవడంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారి రవీందర్ పూర్తిగా విఫలమయ్యారని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ధ్వజమెత్తారు.  గురువారం కొత్తగూడెంలోని ప్రాంతీయ కార్యాలయంలో అధికారి రవీందర్ను కలిసి అక్రమ తవ్వకాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధికారి ప్రవర్తనపై దుర్గాప్రసాద్ నాయక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఎటువంటి అనుమతులు లేకుండా ప్రకృతిని నాశనం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరగా.. ‘మేము ఎప్పుడు వెళ్లాలో మాకు తెలుసు, మీ సూచనలు మాకు అవసరం లేదు‘ అంటూ సదరు అధికారి బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారని ఆయన మండిపడ్డారు. పర్యావరణ సంరక్షణ చట్టాలను తుంగలో తొక్కుతూ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని ఆయన ఆరోపించారు.

తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ అంశంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శికి , జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.