14 July, 2026 | 4:49 AM

నిబద్దతతో విధులు నిర్వహించాలి

14-07-2026 12:00 AM

జీఎం శ్రీనివాస్ 

నస్పూర్, జూలై 13: నిబద్దతతో ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహిస్తే గనికి, శ్రీరాంపూర్ ఏరియాకు తద్వారా సింగరేణికి మంచి పేరు వస్తుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు.

సోమవారం ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్ లకు శ్రీరాంపూర్ ఏరియా జీవీటీసీలో నిర్వహించిన స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడారు. మైనింగ్ చరిత్రతోపాటు మైనింగ్ లో నూతన ఆవిష్కరణలు, రక్షణ పద్దతులు, ఫ్రంట్లైన్ సూపర్వైజర్లు బాధ్యతలు, ఫస్ట్‌ఏడ్, సీపీఆర్, ఎక్స్ ఫ్లోజివ్స్ వాడకం, బ్లాస్టింగ్ విధానం, ఎలక్ట్రికల్  షట్డౌన్ ప్రోసీజర్, ఎస్‌ఓపీ/ఎస్‌ఎంపీలు తదితర అంశాలపై అనుభవజ్ఞులచే ఈ శిక్షణ కొనసాగనుందన్నారు.

మనకు తెలిసిన విషయాలే అని అలక్ష్యం చేయకుండా ఇక్కడ చెప్పే ప్రతీ అంశాన్ని శ్రద్దగా విని వాటిని పని ప్రదేశాలలో అమలు చేస్తేనే మంచి ఫలితాలు సాధ్యమన్నారు. చిన్న ప్రమాదం సైతం ఉత్పత్తికి ఆటంకంగా మారటమే కాదు ఏరియాకు చెడ్డపేరు తెస్తుంది కావున ప్రతీఒక్కరు జీరో హామ్ సాధన దిశగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.

ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలకపాత్ర పోషించే సూపర్ వైజర్ లకు 12 రోజుల రిఫ్రెసర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, రక్షణతో కూడిన ఉత్పత్తిపై ఏరియా పరిధిలోని ఓవర్ మెన్ లు, ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ లు, మెకానికల్ ఫోర్ మెన్ లు, సర్వేయర్లు, సబ్‌ఓవర్సీర్లు 48 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీ సైదా, శ్రీరాంపూర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ జీవీటీసీ మేనేజర్ షేక్ కమ్రూద్దిన్ తదితరులు పాల్గొన్నారు.