ప్రలోభాలపై ఈసీ డేగ కన్ను
నగదు, మద్యం, డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా
చెక్‌పోస్టులపై భద్రత
హైదరాబాద్, మే ౧౦ (విజయక్రాంతి): పార్లమెంట్ పోలింగ్ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఓటర్లను మచ్చిక చేసుకోవ డానికి పార్టీలు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని, నగదు, మద్యం పంపిణీ, ఉచితాలు, డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టాలని అధికారులు, పోలీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు పలు సూచనలు చేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలతో పాటు ఎన్నికల పరిశీలకులు రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించింది. ప్రధానంగా సున్నిత ప్రాంతాలు, మురికివాడలు, బస్తీలలో పర్యటించాలని, కళ్యాణ మండపాలు, కమ్యునిటీ హాళ్లపై దృష్టి పెట్టాలని కోరింది.
దీంతో, ప్లయింగ్ స్కాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులు వద్ద మోహరించాయి. అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్‌కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈసీఐఎల్‌లో పనిచేసే ఇంజనీర్లను నియమించి పోలింగ్ రోజున ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోలింగ్ అధికారులను తీసుకెళ్లే అన్ని వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరవేయడంతో పాటు వాటిని సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేశారు.






