19-12-2025 05:00:47 PM
న్యూఢిల్లీ: బెట్టింగ్ యాపులకు ప్రమోషన్ కేసులో పలువురు ప్రముఖులకు ఈడీ అధికారులు(Enforcement Directorate) షాకిచ్చారు. పీఎంఎల్ఏ కేసులో ప్రముఖుల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. వర్గాల సమాచారం ప్రకారం, ఆస్తులు జప్తు చేయబడిన వారిలో మాజీ భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటీనటులు ఊర్వశి రౌతేలా, సోనూ సూద్, నేహా శర్మ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమీ చక్రవర్తి, అలాగే క్రికెటర్ అంకుష్ హజ్రా ఉన్నారు.
1xBet కేసులో ప్రముఖులపై ఏజెన్సీ చర్యలు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) క్రికెటర్ శిఖర్ ధావన్‌కు సంబంధించిన రూ.4.55 కోట్ల విలువైన ఆస్తులను, మాజీ భారత బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాకు సంబంధించిన రూ.6.64 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని వర్గాలు తెలిపాయి. తాజా స్వాధీనాలతో, 1xBet దర్యాప్తులో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.19.07 కోట్లకు చేరింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, విచారణ ముందుకు సాగే కొద్దీ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఈడీ సూచించింది.
తాజాగా జప్తు చేసిన ఆస్తుల వివరాలు
యువరాజ్ సింగ్ - రూ. 2.5 కోట్లు
రాబిన్ ఉతప్ప - రూ. 8.26 లక్షలు
ఊర్వశి రౌతేలా - రూ. 2.02 కోట్లు
సోనూ సూద్ - రూ. 1 కోటి
మిమీ చక్రవర్తి - రూ. 59 లక్షలు
అంకుష్ హజారా - రూ. 47.20 కోట్లు
నేహా శర్మ - రూ. 1.26 కోట్లు
గురువారం నాడు ఈడీ తీసుకున్న చర్యతో ఈ విచారణ దశలో జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 7.93 కోట్లకు చేరింది.