calender_icon.png 14 October, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా విద్యా బోధన

14-10-2025 07:04:12 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రైవేటు బడులకు ధీటుగా నాణ్యమైన విద్యాబోధన అందుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడారు. విద్యార్థులు యూనిఫార్ములు, నోటుబుక్లు, పాఠ్యపుస్తకాలు అందుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయుల దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్‌పై సమీక్ష చేశారు. సామాన్య శాస్త్ర పాఠానికి సంబంధించిన పటాలను బోర్డుపై గీయించి, విద్యార్థుల అవగాహన స్థాయిని అంచనా వేశారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు.

పరీక్షలపై భయపడకుండా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలక మలుపని, క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను సాధించవచ్చు అని కలెక్టర్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. విద్యార్థుల హాజరు శాతం, సిలబస్ పురోగతి, బోధన నాణ్యతపై వివరాలు కలెక్టర్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులు పూర్తి హాజరు నమోదు కావాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక ప్రణాళికలతో వారిని మెరుగుపరచాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో నేర్చుకునేలా చూడాలని అన్నారు.

సిలబస్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు, పునరావృత పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థిని ప్లక్ష్య స్వయంగా వేసిన కలెక్టర్ చిత్రపటాన్ని అందించగా, ఆమె ప్రతిభను కలెక్టర్ అభినందించారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. భోజన్న, మండల ప్రత్యేక అధికారి అంజి ప్రసాద్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ పుష్పలత, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.