29-11-2025 01:33:04 AM
-ఫూలే ఆశయ సాధన కోసం పనిచేయాలి
-బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నది
-పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : బలహీన వర్గాలతో పాటు మహిళ లు చదువుకోవాలని మహాత్మజ్యోతిరావు ఫూలే పిలుపునిచ్చారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. విద్య ద్వారనే సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ చదువుకో వాలని కోరారు. మహాత్మ జ్యోతిబాఫూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆలికేఫ్ వద్ద ఫూలే విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, వీ హనుమంతరావు, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్‌కుమార్, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్ తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ విద్య, ఉపాధి, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రజాప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నదని తెలిపారు. ఆర్టికల్ 14లో కూడా బలహీన వర్గాలకు అన్యా యం చేయాలని ఎక్కడా చెప్పలేదని, రిజర్వేషన్లకు పరిమితి కూడా విధించలేదని వీహెచ్ పేర్కొన్నారు. వేరే రాష్ట్రంలో ఇందిరా సహాని కేసు, సుప్రీంకోర్టులో కృష్ణమూర్తి కేసును తీసుకుని 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటొద్దని చెప్పడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో ఏమైనా లోపాలుంటే బీసీ నాయకు లు చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న పార్టీలను నిలదీయాలని వీహెచ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగు తుందని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బలహీనవర్గాలు సమాజంలో అందరితో సమానంగా నిలబడాలంటే దానికి విద్యనే ప్రధానమన్నారు.
పూలే భౌతికంగా దూరమై 135 ఏళ్లు అవుతున్నా ఇంకా చరిత్రలో ప్రజల మధ్యలో ఉన్నారంటే ఆయన చూపిన సంస్కరణలు, మార్గమే అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ లక్ష్మణ్‌యాదవ్, అప్సర్ యూసుఫ్ జాయి, పీ నారాయణస్వామి, పులి జగన్, గరిగంటి రమేష్, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్, పీ రామ్మోహన్, కృష్ణగౌడ్, గడ్డం శ్రీధర్, కోట అనిల్, రాములు సుధాకర్, మహేష్‌గౌడ్ తదిరులు పాల్గొన్నారు.