29-11-2025 01:24:13 AM
కోకాపేటలో ఎకరం రూ.151 కోట్లు!
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ రియ ల్ ఎస్టేట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. కోకాపేట నియోపోలిస్ భూముల వేలం పాటలో కాసుల వర్షం కురిసింది. హెచ్‌ఎండీఏ నిర్వహించిన రెండో విడత ఈ-వేలంలో ధరలు ఆకాశాన్నంటాయి. మొదటి విడత రికార్డులను తిరగరాస్తూ.. దేశంలోనే అత్యంత ఖరీదైన అర్బన్ ల్యాండ్ డెస్టినేషన్‌గా నియో పోలిస్ నిలిచింది.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం పాట.. సాయంత్రం 6:30 దాటినా హోరాహోరీగా సాగింది. డెవలపర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ధరలు అనూహ్యం గా పెరిగాయి. ప్లాట్ నం.15.. 4.03 ఎకరాలు.. దీని కోసం రికార్డు స్థాయి పోటీ జరిగింది. చివరికి ఎకరాకు ఏకంగా రూ. 151.25 కోట్లు పలికింది. లక్ష్మీనారాయణ గుమ్మడి, కార్తీష్‌రెడ్డి మద్గుల, శరత్, శ్యామ్ సుందర్‌రెడ్డి బృందం ఈ ప్లాట్‌ను దక్కించుకుంది.
ప్లాట్ నం.16.. 5.03 ఎకరాలు..ఈ ప్లాట్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. దీనికి ఎకరాకు రూ.147.75 కోట్లు వెచ్చించింది. కేవలం ఈ రెండు ప్లాట్ల మొత్తం 9.06 ఎకరాల వేలం ద్వారానే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు రూ.1,352 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. నవంబర్ 24న జరిగిన మొదటి విడత, నేటి రెండో విడ త కలిపి ఇప్పటివరకు నియోపోలిస్ వేలం ద్వారా మొత్తం రూ.2,708 కోట్లు హెచ్‌ఎండీఏ ఖాతాలో చేరాయి.
సగటున ఎకరం ధర రూ.142.83 కోట్లుగా నమోదు కావడం హై దరాబాద్ ల్యాండ్ మార్కెట్ సత్తాను చాటుతోంది. రెండు విడతల్లోనూ రికార్డు స్థాయి ధరలు రావడంతో హెచ్‌ఎండీఏ తదుపరి వేలంపై భారీ అంచనాలు పెట్టుకుంది. డిసెంబర్ 3న నియోపోలిస్‌లో, డిసెంబర్ 5న గోల్డెన్ మైల్‌లో జరగబోయే ఈ-వేలంలోనూ డెవలపర్ల నుంచి ఇదే స్థాయి స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు.