29-11-2025 01:35:30 AM
కొట్లాడినా బీసీలకు దక్కని 42 శాతం రిజర్వేషన్
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : అవును.. అదే నిజమైంది. చట్ట సవరణ లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని ‘విజయక్రాంతి’ దిన పత్రిక ముందే విశ్లేషణాత్మకంగా వివరించింది. చట్ట సవరణ ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్ అమలు సాధ్యమవుతుందని ప్రభుత్వానికి సూచించింది. బీసీలకు పార్టీ పరంగానే రిజర్వేషన్ అమలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని హెచ్చరించింది.
‘విజయక్రాంతి’ హెచ్చరించినట్టుగానే ప్రస్తు త పరిణామాలన్నీ ప్రతిబింబిస్తున్నాయి. పంచాయతీ నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది, కానీ, బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పుతో స్పష్టత రాలేదు. చివరకు బీసీలకు పార్టీ పర రిజర్వేషన్లే దిక్కయ్యాయి.
బీసీలకు ఒరిగిందేమిటి..?
బీసీ వర్గాలతో దోబూచులాడుతున్న రిజర్వేషన్ అంశానికి తెరపడటం లేదు. 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుందో, లేదో అనే సందిగ్ధ, సంకట పరిస్థి తుల్లో కొట్టుమిట్టాడుతున్న బీసీల నెత్తిపై పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ బండరాయిని మోపింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఎన్నికల నిర్వహణ ఉంటుందని భావించిన బీసీల ఆశలు ఒక్కసారిగా పటాపంచలు అయ్యాయి.
బీసీల దశాబ్దాల స్వప్నం నెరవేర్చుకునేందుకు అలుపెరగని పోరాటం చేసినప్పటికీ వారికి ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వాలు, పరిపాలన, పాలసీలు మారిన బీసీలకు 42శాతం రిజర్వేషన్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు ఇచ్చిన హామీకి అనుగుణంగా కులగణన చేపట్టింది.
అసెంబ్లీలో బిల్లు, గవర్నర్‌కు ఆర్డినెన్స్ సమర్పించడం, తర్వా త ప్రత్యేక జీవో తీసుకురావడం ద్వారా రిజర్వేషన్ అమలు కోసం ప్రయత్నాలు చేసింది. దీంతో బీసీల్లో రిజర్వేషన్ల సాకా రం పట్ల ఆశలు చిగురించాయి. కానీ ప్రభు త్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యా యి. ఈ క్రమంలో రిజర్వేషన్ అమలు కోసం బీసీలు మరింత నిరీక్షించాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం నిరంతరం కొనసాగే
రాజకీయ చర్చగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీసీలకు ప్రాతినిథ్యం పెంచామని పాలక వర్గాలు చెబుతున్నప్పటికీ రిజర్వేషన్ రూపంలో వచ్చే చట్టబద్ధ మైన భరోసా మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. దీనికి రాజకీయ, చట్టపర, పరిపాలనా పరమైన కారణాలున్నాయి. వాస్తవానికి బీసీల ఓటు బ్యాంకు తెలంగాణ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉంది. కానీ ఆయా వర్గాలకు తగిన ప్రాధాన్యత మాత్రం లభించడం లేదు.
బీసీ జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మాత్రం 20శాతం లోపే ఉంటున్నాయి. దీంతో బీసీలు భారీగా నష్టపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లే ఇందుకు నిదర్శనం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీల దక్కే స్థానాలు 17.08 శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నా యి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆశపెట్టుకున్న బీసీలు ఇప్పుడు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై పోటీ కాదు అనే వాదన వినిపిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్ అమలుతుందా అని అనుమానం వ్యక్తం అవుతోం ది. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు లేకుంటే బీసీ సీట్ల సంఖ్య తగ్గిపోతుందని, స్థానిక నాయకత్వ నిర్మాణం దెబ్బతింటుందని, గ్రామ, మండల స్థాయిల్లో బీసీ నాయ కులు ఎదగడానికి అవకాశాలు తగ్గుతాయని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీసీల భవిష్యత్ ప్రశ్నార్థకం
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌కు సం బంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 46కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ విడుద లైందని, నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోందని, ఈ దశలో స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి తామే ఆదేశాలిచ్చామని, 50 శాతం కోటాకు మించకుం డా పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్టు గుర్తు చేసింది.
ఈ క్రమంలో స్టే ఎలా ఇస్తామని పిటిషనర్‌ను ప్రశ్నించింది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్ట పరంగా సాధ్యం కాదని స్పష్టమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల అమలుకు అనుకూ లంగా పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగకపోవడం, మరోవైపు పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దాదాపు అసాధ్యం. దీంతో బీసీల వర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే పార్టీల పరంగా రిజర్వేషన్లు అమలు చేసినా తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదని బీసీలు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కూడా బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే మొదటి విడత ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. నేటితో నామినేషన్ కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బీసీల భవిష్యత్ ఎటూ తేలకుండా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.
అసంతృప్తిలో బీసీలు
ప్రస్తుత పరిణామాలతో బీసీ ఓటర్లు పెద్దఎత్తున అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో స్థానిక నాయకత్వమే అసెంబ్లీ ఎన్నికలకు కీలకమయ్యే క్రమంలో భవిష్యత్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతోపాటు గ్రామ/మండల రాజకీయాల్లో అసంతృప్తి పెరగడమే కాక అధికార పార్టీపై నమ్మకం దెబ్బతింటుంది. దీనికితోడు త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలతోపాటు అసెంబ్లీ/పార్లమెంట్ స్థాయిలో రాజకీయ లెక్కలు మారే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో. పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలు ద్వారా చట్టపరమైన రిజర్వేషన్ కోసం బీసీలు ఇంకా చాలాకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు తీర్పులు, డేటా సేకరణ, ప్రభుత్వ నిర్ణయాలను గమనిస్తే రిజర్వేషన్ అమలు కోసం బీసీలు మరింత నిరీక్షించాల్సిందేనని స్పష్టమవుతున్నది. దీంతో తెలంగాణ బీసీల్లో ఆగ్రహం పెరుగుతున్నది. బీసీల పట్ల పార్టీల, ప్రభుత్వాల హామీలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని, అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని మండిపడుతున్నారు. సవరణ, కోర్టు తీర్పు పేరిట దాటవేత ధోరణీతో బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని విమర్శిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కనీసం 22 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంలోనూ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తమవుతుంది. 50 శాతం పైనే ఉన్న బీసీలకు రాజకీయ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానకి గుణపాఠం చెప్పాలని దిశగా ముందుకు సాగుతున్నారు.