29-11-2025 01:26:54 AM
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జీవో నంబర్ 46పై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీల కు కేటగిరీల వారీగా కోటా కోరిన వారికి సమధానమిస్తూ.. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఎన్నికల ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎలక్షన్‌పై స్టే విధించ లేమని స్పష్టం చేసింది.
బీసీ సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా..? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదని మందలించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌కు సంబంధించి జీవో- 46పై మడివాల మచ్చదేవ రాజకుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
ఇరువైపులా వాదనలు...
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఏ, బీ, సీ, డీ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రస్తుతం రిజర్వేషన్లు అలా అమలు కావడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. ఎన్నికల సంఘం బీసీ రిజర్వేషన్లలో ఉప-వర్గీకరణ పాటించలేదని, డెడికేటెడ్ కమిషన్ నివేదిక పూర్తి డేటాను బహిర్గతం చేయకుండానే ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉప వర్గీకరణ లేకపోవడంతో బీసీలు తమ కోటా నష్టపోతారని వాదించారు.
అందుకు న్యాయస్థానం స్పందిస్తూ.. ‘సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా?’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పినట్లు హైకోర్టు గుర్తు చేసింది. 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెఎంసీ ఎలక్షన్‌ను రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అందుకు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని వాదించారు. ఇరువైపులా వాదన లు విన్న న్యాయస్థానం స్పందిస్తూ.. తామే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించి, తామే స్టే ఎలా ఇవ్వగలమని పిటిషనర్ తరఫును న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్ తర ఫు న్యాయ వాది స్పందిస్తూ.. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేసి ఆ కాపీ ఇవ్వాలని కోరా రు.
న్యాయస్థానం కలుగజేసుకుంటూ.. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వదని తేల్చిచెప్పింది. అలాగే సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని, అందుకు ఆరు వారాల గడువు ఇస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.