calender_icon.png 29 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమెకేదీ ప్రాధాన్యం?

29-11-2025 01:32:14 AM

పదవుల పంపకంలో మహిళలపై రాజకీయ పార్టీల చిన్నచూపు

  1. జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించడంలో వివక్ష 
  2. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే కాంగ్రెస్‌లో నలుగురికే డీసీసీ పదవులు 
  3. బీఆర్‌ఎస్‌లో నలుగురికి.. బీజేపీలో ఇద్దరికే జిల్లా పార్టీ పగ్గాలు 
  4. మా ఓట్లు కావాలి.. పదవులు మాత్రం ఇవ్వరా? 
  5. అసంతృప్తితో రగిలిపోతున్న ఆయా పార్టీల్లోని మహిళా నేతలు

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : జనాభాలో సగభాగమైన మహిళలకు అన్ని రాజకీయ పార్టీలు పదవుల్లో ప్రాధాన్యం కల్పించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్ల కోసం పాకులాడుతున్న పార్టీలు.. పదవుల విషయానికి వచ్చేసరికి చిన్న చూపు చూస్తు న్నాయని అతివలు ఆవేదన చెందుతున్నారు. పేరుకు ఒకటి, రెండు పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కీలక స్థానా ల్లో ఉండటమే కాకుండా.. పైలెట్లుగా రాణిస్తూ ..ఆపరేషన్ సిందూర్ వంటి దేశ రక్షణ మిషన్‌లకు నాయకత్వం వహించే స్థాయికి మహిళలు ఎదిగినా రాజకీయ రంగంలో మాత్రం ఆ నాటి నుంచి నేటి వరకు అథమ స్థానంలోనే ఉన్నారనే చర్చ జరుగుతోంది. 

ఇందిరమ్మ రాజ్యంలోనూ..

వివిధ రాజకీయ పార్టీలు తమ పార్టీ రాష్ట్ర కమిటీల్లో అక్కడక్కడా కొంత ప్రాతినిథ్యం కల్పించినా.. ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల్లో అధికార కాంగ్రెస్‌తో సహా విపక్షాలు సైతం మహిళా మణులను  విస్మరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి పనులకు  ఇందిరమ్మ జపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు పదవుల పంపిణీ విషయంలో  వివక్ష చూపిస్తోందని స్వపక్ష మహిళలే అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల అధికార పార్టీ జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీలు కలిపి మొత్తంగా 36 మందికి బాధ్యతలు అప్పగించింది.  ఇంకా రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీలను ప్రకటించాల్సి ఉంది. వీటిలో సామాజిక న్యా యం పాటించామని గొప్పలు చెప్పుకుంటున్న హస్తం పార్టీ.. మహిళల విషయానికి వచ్చేసరికి సామాజిక న్యాయం ఉండదా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అయితే 36 జిల్లా కా్ంర గెస్ కమిటీ అధ్యక్షుల్లో .. మహిళలకు కేవలం నలుగురికి మాత్రమే అవకాశం ఇవ్వడంపైనా సొంత పార్టీలోని మహిళలు అసంతృప్తితో ఉన్నారు. ఆదిలాబాద్ -ఆత్రం సుగుణ, భద్రా ద్రి కొత్తగూడెం - తోటదేవి ప్రసన్న, జనగాం- లకావత్ ధన్వంతి, మహబూబాబాద్ - భుక్యా ఉమకు డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశమిచ్చింది.

బీజేపీలో ఇద్దరేనా..

ఇక కేంద్రంలోని బీజేపీ కూడా మహిళలకు పదవులు ఇవ్వడంలోనూ మరింత వివక్ష ప్రదర్శిస్తుందనే విమర్శలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ ఏడాది 33 జిల్లాలతో పాటు నగరాలు, పార్టీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నవి మొత్తంగా 38మందికి మూడు విడతలుగా పదవులు కట్టబెట్టింది.  వీరిలో కేవ లం ఇద్దరు మహిళలకు మాత్రమే  బీజేపీ జి ల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. 

అం దులో సూర్యాపేటకు చల్లా శ్రీలతారెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా  సి. గోదా వరిని నియమించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం బిల్లును పార్లమెంట్‌లో ఆమో దించిన కేంద్ర ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో మ హిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అయితే చట్టపరంగా మహిళలకు 33 శాతం ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ.. పార్టీ పదవుల విషయానికి వచ్చేసరికి ఎందుకు అమలు చేయడం లేదని మహిళా నేతలు నిలదీస్తున్నారు. 

బీఆర్‌ఎస్‌లోనూ అత్తెసరుగానే..

బీఆర్‌ఎస్ పార్టీలోనూ మహిళలకు పార్టీ పదవులు అత్తెసరుగానే దక్కాయనే వాదనలు ఉన్నాయి. అయితే, ఆ పార్టీ ఇంకా పాత కమిటీలనే కొనసాగిస్తోంది. నిర్మాణపరంగా ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని గులాబీ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియమించిన జిల్లా పార్టీ కమిటీలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్ లో కూడా 33 జిల్లాలతో పాటు నగరాలకు కలిపి మొత్తం 38 మందిని అధ్యక్షులుగా నియమింయింది.

వారిలో కేవలం నలుగురు మహిళలు మాత్రమే ఉండడం గమనార్హం. మెదక్- పద్మాదేవేందర్‌రెడ్డి, మహబూబాబాద్ - మాలోతు కవిత, జయశంకర్ భూ పాలపల్లి - గండ్ర జ్యోతి, అసిఫాబాద్ జిల్లా కు ఎమ్మెల్యే కోవా లక్ష్మిని ఇంచార్జీగా బీఆర్‌ఎస్ పార్టీ నియమించింది. వామపక్ష పార్టీలు కూడా జిల్లా పార్టీ కార్యదర్శి పదవులు మహిళలకు పెద్దగా అవకాశం కల్పించిన దాఖలాలు లేవు.

ఇలా ప్రతి రాజకీయ పార్టీ మహిళలను రాజకీయంగా ఎదగనీయడం లేదనే విమర్శలున్నాయి. దీంతో తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్న పార్టీలపై మహిళా నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే, ఆయా పార్టీల్లో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి తదితర పదవుల్లో  కొందరు మహిళలున్నా.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా కల్పించడం లేదని వాపోతున్నారు.