calender_icon.png 29 November, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24/7 వైద్యసేవలు అందని ద్రాక్షేనా

29-11-2025 01:39:31 AM

అత్యవసర సమయాల్లో ఈఎస్‌ఐ కార్మికుల అవస్థలు

  1. వేతన పరిమితి రూ.21 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని డిమాండ్
  2. నిరంతరాయంగా చికిత్స అందే ఈఎస్‌ఐ ఆస్పత్రులు రెండే రెండు 
  3. ఒకటి ఎర్రగడ్డ.. రెండోది నాచారం హాస్పిటల్స్
  4. సుదూరప్రాంతాల్లో ప్రమాదం సంభవిస్తే.. ఇక అంతే సంగతులు 
  5. పారిశ్రామిక ప్రాంతాల్లో మరిన్ని ఆస్పత్రులు నెలకొల్పాలని విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక శాఖ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ (ఈఎస్‌ఐ) పథకం ఉద్దేశం గొప్పదైనప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ సేవలు అంతంత మాత్రంగా ఉన్నాయనే అభిప్రాయం కార్మికుల నుంచి వ్యక్తమవుతున్నది. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు, చిరుద్యోగులు ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నారు.

వీరంతా అత్యవసర సమాయా ల్లో ఈఎస్‌ఐ ఆసుపత్రులకే వచ్చి చికిత్స తీసుకుంటారు. ప్రస్తుతం వీరు ప్రధానంగా మూడు డిమాండ్లు కోరుతున్నారు. పథకం వర్తించేందుకు వేతన పరిమితి పెంచాలని కోరుతున్నారు. అత్యవసర సమయాల్లో నగదు రహిత చికిత్స ఇవ్వాలని, అలాగే రాష్ట్రంలో 24/7 చికిత్స అం దించే ఈఎస్‌ఐ ఆసుపత్రుల సంఖ్య పెం చాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పథకం వర్తించాలంటే కార్మికుడి నెలవారీ వేతనం రూ. 21 వేలు ఉండాలి.

పరిమితి కంటే ఎక్కువ వేతనం తీసుకునేవారు పథకానికి అనర్హులవుతారు. పరిశ్రమలు, కంపెనీల యాజమాన్యాల వార్షిక ఇంక్రిమెంట్లు, పండుగల బోనస్‌లు, పనితీరు ఆధారంగా వచ్చే ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) కారణంగా చాలా మంది కార్మికులు రూ.21 వేల స్లాబ్ దాటిపోతున్నారు. పర్యావసానంగా వారంతా ఈఎస్‌ఐ ఆరోగ్య భద్రత సేవలను కోల్పోతున్నారు.

అందుకే ప్రభుత్వం వేతన పరిమితిని తక్షణం రూ. 30 వేలకు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ చిన్న మార్పు చేస్తే సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్లు, హౌస్ కీపింగ్ వర్కర్లు, మల్టీ-టాస్క్ సర్వీసులు అందించే వేలాది మంది చిరుద్యోగులకు ఆరోగ్య భద్రత లభిస్తుందంటున్నారు.

సూదూరంలో ఆస్పత్రులు

పరిశ్రమలో, ఏదైనా కంపెనీలో ప్రమా దం సంభవించినప్పుడు, లేదా కార్మికుడు ఇంకేదైనా ప్రమాదం బారిన పడినప్పుడు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చి 24/7 నడిచే ఆసుపత్రులు సుదూర ప్రాంతాల్లో ఉండటం కార్మికులకు శాపం గా మారింది. ప్రస్తుతం ఆ తరహా ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఎర్రగడ్డ, నాచారంలో మాత్రమే ఉన్నాయి.

ఒకవేళ సుదూర ప్రాంతాలైన శంషాబాద్, పటాన్‌చెరులో ఏదైనా ప్రమా దం సంభవిస్తే, అక్కడి నుంచి ఎర్రగడ్డ, నాచారం ఆసుపత్రులకు వారిని తరలించడం కష్టతరమవుతున్నది. ఆస్పత్రులకు చేర్చేలోపు కార్మికుడి ఆరోగ్యం విషమిం చవచ్చు. కొన్ని సందర్భాల్లో మరణాలు సై తం సంభవించొచ్చు. మరోవైపు కార్మికుని ప్రాణాలు కాపాడేందుకు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళితే ముందుగా నగదు చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి. 

అత్యవసర సమయాల్లో, లేదంటే పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు దాదాపు ప్రైవేటు యాజమాన్యాలు చికిత్సకు డబ్బు చెల్లిస్తాయి. లేదంటే క్షతగాత్రులు బంధువులు, కుటుంబ సభ్యు లు పక్కనుంటే ఎన్నికష్టాలు పడైనా చికిత్సకు సంబంధించిన ఫీజులుచెల్లిస్తారు. కానీ, య జమానులు అందుబాటులో లేకపోవడం, కుటుంబసభ్యులు, బంధువులు క్షతగాత్రుడికి చెంతకు చేరుకునేందుకు సమయం పట్టే సమయాల్లో పరిస్థితి ఏంటి? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అందుకే.. అత్యవసర సమయాల్లో నగదురహిత చికిత్స వెసులుబా టను ప్రైవేటు ఆసుపత్రుల్లో కల్పించాలని కోరుతున్నారు. 

మరిన్ని ఆస్పత్రులు కావాలి

ఈఎస్‌ఐ సేవలు మరింత విస్తృతంగా కార్మికులకు అందాలంటే, పథకం పరిధిలో 24x7 ఆసుపత్రుల సంఖ్య మరింత పెంచాలని కార్మికులు కోరుతున్నారు. ప్రస్తుతం పథకం పరిధిలో రెండంటే రెండే నిరంతరాయంగా వైద్యసేవలు అందించే ఆస్పత్రులు ఉన్నాయి. ఇవికాక, మిగిలినవి కేవలం డిస్పెన్సరీలు. కార్మికశాఖ చొరవ తీసుకుని పటాన్ చెరు, చౌటుప్పల్, తూముకుంట, షాద్‌నగర్‌లోనూ 24x7 వైద్యసేవలు అందించే ఈఎస్‌ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఓఆర్‌ఆర్, రీజినల్ రింగ్‌రోడ్ మధ్య ప్రాంతా ల్లో పారిశ్రామిక కార్యకలాపాలు కేంద్రీకృతమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఈఎస్‌ఐ సేవలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోడం ఈ ప్రాంతం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఎర్రగడ్డ, నాచారం ఈఎస్‌ఐ వైద్యసేవల మాదిరిగానే ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ఆర్ మధ్య ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు.

లేదంటే అత్యవసర చికిత్సకు తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. అలాగే ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో రోగులతో సహాయకులుగా వచ్చే అటెండెంట్లకు సైతం కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు. బెడ్, తాగునీరు, అల్పాహారం వంటి వసతులు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.