29-11-2025 01:09:53 AM
హైదరాబాద్/వరంగల్, నవంబర్ 28 (విజయక్రాంతి): కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. జవాబు పత్రాల మూల్యాంక నంలో అవకతవకలతోపాటు ఇష్టారీతిన ఇన్‌ఛార్జ్‌ల నియామకంలో ఆరోపణలు రావడంతో ఆయన శుక్రవారం రాజీనామా చేశారు. కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై వార్తా కథనాలు రావడం, దీనిపై ప్రభుత్వం సీరియస్ కావడంతోనే యూనివర్సిటీ వీసీ రాజీనామా చేసిన ట్లుగా తెలుస్తోంది.
పరీక్షల నియంత్రణ బాధ్యతలు దంత వైద్యుడికి ఇవ్వడం, ఆరోపణలున్న అధికారికి రిజిస్ట్రార్ బాధ్యతలివ్వడం, పీజీ రేడియాలజీ పరీక్షలో పాత పేపర్లు ఇవ్వడం, పరీక్ష లో ఫెయిలైన విద్యార్థులు రీకౌంటింగ్‌లో పాస్ కావడం, సీట్లు కేటాయింపు, డిప్యూటేషన్‌పై వచ్చిన వైద్యులకు కీలక బాధ్యతలు అప్పగించడం వంటి ఆరోపణలు వీసీపై ఉన్నాయి.
కఠిన చర్యలు తప్పవు: సీఎం
కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై ముఖ్యమం త్రి ఎనుమల రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ ఛార్జీల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణల పై సీఎం ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివ రణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్యే లే దని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పని చేసేవారు సమర్థంగా, పా రదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని సీఎం సూచించారు.
ఇటీవల హరీశ్‌రావు గవర్నర్‌కు ఫిర్యాదు
వరంగల్ నగరంలోని కాళోజీ హెల్త్ యూ నివర్సిటీలో ఇన్‌చార్జ్‌ల నియామకంలో అవకతవకులు, డబ్బులు తీసుకొని రీకౌంటింగ్ లో ఉత్తీర్ణులను చేసినట్లు ఆరోపణలు, నోటిఫికేషన్లు లేకుండా నియామకాలు జరిపినట్లు బీఆ ర్‌ఎస్ నేత హరీశ్‌రావు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాలేజీ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదే శించింది.
విజిలెన్స్ విచారణలో పలు అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి, ప్ర భుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వీసీ వ్యవహారంపై సీరియస్ అయ్యారని సమాచారం. దీనితో వీసీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.